100 డాలర్లు దాటిన ముడి చమురు
- సెన్సెక్స్ 813 పాయింట్ల పతనం
- 3 నెలల కనిష్ట స్థాయికి చేరిక
- నిఫ్టీ 23,450 స్థాయి దిగువకు
ముంబై, సెప్టెంబర్ 9: పశ్చిమాసియా(West Asia)లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధర(Crude oil price) బ్యారెల్ 100 డాలర్లను దాటింది. దీంతో వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక సేవలు, చమురుతోపాటు గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల్లో ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 813 పాయింట్లు క్షీణించి మూడు నెలల కనిష్ట స్థాయికి చేరింది.
నిఫ్టీ 23,450 స్థాయికి దిగువన ముగిసింది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 813.35 పాయింట్లు లేదా 1.08 శాతం పడిపోయి, ఆ రోజు కనిష్ట స్థాయి అయిన 74,764.23 వద్ద ముగిసింది. ఇది గత మూడు నెలల్లోనే అత్యల్ప ముగింపు కావడం గమనార్హం. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 203.60 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి, దాదాపు మూడు నెలల కనిష్ట స్థాయి అయిన 23,431.50 వద్ద ముగిసింది.
గతంలో జూన్ 11న ఈ సూచీ ఇదే స్థాయికి దగ్గరగా ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్ అత్యధికంగా 4.55 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్ 4.43 శాతం, టెక్ మహీంద్రా 3.87 శాతం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2.26 శాతం మేర క్షీణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ కూడా నష్టపోయిన ప్రధాన కంపెనీల జాబితాలో ఉన్నాయి.
అదానీ పోరట్స్ 3.67 శాతం పెరుగుదలతో లాభపడిన కంపెనీలలో అగ్రస్థానంలో నిలిచింది. టాటా స్టీల్, ట్రెంట్, ఎన్టీపీసీ కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి. ప్రపంచ చమురు ధరలకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ (ముడి చమురు) ఆయిల్ ధర 2.67 శాతం పెరిగి బ్యారెల్‌కు 100.5 డాలర్లకు చేరింది. ‘నిరంతర అమ్మకాల ఒత్తిడి, విస్తృత రిస్క్- ఆఫ్ మూడ్ కారణంగా మార్కెట్ సెంటిమెంట్ మందగించింది. దీంతో భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో కూడా తమ క్షీణతను కొనసాగించాయి.
బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. పెరిగిన ముడి చమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ అస్థిరతలో తీవ్ర పెరుగుదల వంటివి పెట్టుబడిదారుల విశ్వాసంపై ఒత్తిడిని కొనసాగిస్తూ, మార్కెట్లో నెలకొన్న బేరిష్ ధోరణిని మరింత బలపరుస్తున్నాయి అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ అయిన ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ పేర్కొన్నారు. బీఎస్ఈ స్మాల్స్కేప్ సెలెక్ట్ సూచీ 0.59 శాతం, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.52 శాతం క్షీణించాయి.
బీఎస్ఈ రంగాల సూచీలలో, ఐటీ రంగం అత్యధికంగా 3.21 శాతం పతనమైంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 101 డాలర్ల మార్కుకు చేరుకోవడంతో, ద్రవ్యోల్బణం, రూపాయి, దేశ విదేశీ మారకపు బ్యాలెన్స్‌లపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో, భారతీయ ఈక్విటీలు వరుసగా మూడవ సెషన్లో కూడా తమ పతనాన్ని కొనసాగించాయి.