కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజు

12-10-2026 | 11:13pm

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్(SP Rohit Raju IPS) సోమవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌(District Command and Control Center)ను ప్రారంభించారు.  జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల గుర్తింపు, దర్యాప్తును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని  సూచించారు.

ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, పోలీస్ స్టేషన్లలోని కెమెరాలను, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ప్రస్తుతం మొత్తం 467 సీసీటీవీ కెమెరాలను ఈ కేంద్రానికి అనుసంధానం చేయడంతో జిల్లాలో నిఘా వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఈ వ్యవస్థ ద్వారా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను  గుర్తించడం, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం సులభతరం కానుంది.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు, నేరాల నియంత్రణలో సీసీటీవీ నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అనంతరం  అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు