భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు మద్దతివ్వాలి

28-09-2026 | 01:30pm

ఇల్లెందు,(విజయక్రాంతి): స్వేచ్ఛ, సార్వభౌమత్వం కోసం పాలస్తీనా, క్యూబా, ఇరాన్‌ ప్రజలు చేస్తున్న పోరాటాలకు భారత ప్రజలు భగత్‌సింగ్‌ స్ఫూర్తితో మద్దతుగా నిలవాలని సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య(Former MLA Gummadi Narasayya), చండ్ర అరుణ పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌(Bhagat Singh) 119వ జయంతి వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఇల్లందులో పీడీఎస్‌యూ, పీవైఎల్‌, పీఓడబ్ల్యూ, టీయూసీఐ, ఏఐయూకేఎస్‌ ఆధ్వర్యంలో కాగడాల ప్రభాతబేరి నిర్వహించారు. 

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ జగదాంబ సెంటర్‌, పాత బస్టాండ్‌, బుగ్గవాగు సెంటర్‌ మీదుగా సాగి భగత్‌సింగ్‌ విగ్రహం వద్దకు చేరుకుంది. నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భగత్‌సింగ్‌ వలస ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమే ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతూ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందని నాయకులు విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షల కారణంగా దేశ ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. పాలస్తీనా, ఇరాన్‌పై జరుగుతున్న దాడులను భారత ప్రభుత్వం ఖండించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌, పీడీఎస్‌యూ, పీవైఎల్‌, పీఓడబ్ల్యూ, టీయూసీఐ, ఏఐయూకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు