ఇల్లెందు అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేయాలి
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు మున్సిపాలిటీ(Yellandu Municipality) అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు వెంటనే మంజూరు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)ని కోరారు. ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య సహకారంతో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆదివారం ఖమ్మంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించిన జీవో నెం.76ను పూర్తిస్థాయిలో అమలు చేసి, పట్టణానికి రావాల్సిన ప్రయోజనాలను కల్పించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఇల్లందు అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు అత్యవసరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దసరా ఉత్సవాలకు రూ.30 లక్షలు విడుదల చేయాలి
ఇల్లందులో దసరా ఉత్సవాల నిర్వహణకు మున్సిపాలిటీ వద్ద తగినన్ని నిధులు లేవని, జిల్లా కలెక్టర్ నిధుల నుంచి రూ.30 లక్షలు తక్షణమే విడుదల చేయాలని చైర్‌పర్సన్ కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎండి జాఫర్, సుదర్శన్ కోరి, సిహెచ్ శృతి రమేష్, ఎస్కే సైదుమియా, కొర్లపాటి కిరణ్, పర్రె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.