కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్!
సుజాతనగర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఘటనను నిరసిస్తూ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని తగలబెట్టేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. బీజేపీ నాయకులు మూకుమ్మడిగా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుని లోపలికి చొరబడి నిప్పంటించేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న కొత్తగూడెం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ఈ ఘటనలో బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ శ్రేణులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని నరకాసుర వధగా చిత్రీకరించి కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేయడాన్ని బీజేపీ నేతలు దుశ్చర్యగా అభివర్ణిస్తూ ఖండించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి సుస్థిర పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని దగ్ధం చేయడం కాంగ్రెస్ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బలగం శ్రీధర్, దురిశెట్టి కుమార్, మోహన్ కృష్ణ, రాకేష్, గాయత్రి, పద్మ తదితరులు పాల్గొన్నారు.