5 September, 2026 | 1:16 PM

జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. బస్సులు దారి మళ్లింపు

05-09-2026 | 11:33am

విధులకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

బోథ్‌, సెప్టెంబర్‌ 5 (విజయ క్రాంతి): 44వ నంబర్‌ జాతీయ రహదారిపై నేరడిగొండ నుంచి ఇచ్చోడ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం కావడంతో పోలీసు అధికారులు బస్సులను దారి మళ్లించారు. ఉదయం పూట రోడ్డు ప్రమాదం జరగడంతో పాటు కుప్తి బస్టాండ్‌ వద్ద వంతెనపై మరమ్మతులు జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు వాహనాలను జాతీయ రహదారిపై ఒకే వైపు నుంచి రాకపోకలు కొనసాగిస్తుండటంతో పది రోజులుగా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్‌ జాం కావడంతో ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్లే బస్సులను పోలీసు అధికారులు ఇచ్చోడ నుంచి బజార్‌హత్నూర్‌, సోనాల మీదుగా జాతీయ రహదారి వైపు మళ్లించారు.

మరోవైపు వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.

జాతీయ రహదారిపై కొనసాగుతున్న మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు జాదవ్‌ అనిల్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మరమ్మతులు కొనసాగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించి, ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించిన మరుసటి రోజే ట్రాఫిక్‌ జాం కావడంతో పాటు రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకోవడం జరిగింది.

మరిన్ని వార్తలు