టిఫిన్‌ తినలేం.. బియ్యం కొనలేం!

25-10-2026 | 01:33pm

బోథ్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పేద, సామాన్య ప్రజలు మూడు పూటలా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంటోంది. ఉచిత రేషన్ బియ్యం అందుతున్నప్పటికీ నూనె, పప్పుల ధరలు పెరుగుతుండటంతో వాటిని కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పస్తులు ఉండాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

సన్న బియ్యం కిలో రూ.90

సన్న బియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 15 రోజుల క్రితం కిలో రూ.60 పలికిన సన్న బియ్యం ధర ఒక్కసారిగా రూ.90కు చేరింది. దీంతో సన్న బియ్యం కొనాలంటేనే ప్రజలు వెనుకాడుతున్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులైన పప్పులు, నూనె, కూరగాయల ధరలు పెరగడంతో రోజువారీ భోజన ఖర్చులు భారంగా మారుతున్నాయి. మూడు పూటలా కడుపునిండా తినలేని పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాయ్, టిఫిన్ ధరలూ పెరిగాయి

గత నెలలో చక్కెర ధర ఒక్కసారిగా పెరగడంతో హోటల్ యజమానులు రూ.5, రూ.6 ఉన్న చాయ్ ధరను రూ.10కు పెంచారు. ప్రస్తుతం చక్కెర ధర తగ్గినా చాయ్ ధరలు మాత్రం తగ్గడం లేదని పలువురు వాపోతున్నారు. మరోవైపు టిఫిన్ల ధరలు సైతం పెరగడంతో ఉదయం వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే కూలీలు టిఫిన్ కేంద్రాలకు వెళ్లాలంటేనే వెనుకాడుతున్నారు. గతంలో రూ.30 ఉన్న టిఫిన్ ధర ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50కు చేరింది.

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో టిఫిన్ల ధరలు పెంచక తప్పడం లేదని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ఏదేమైనా ఎల్‌నినో (El Niño) ప్రభావంతో పాటు పెరుగుతున్న ధరలు సామాన్యులపై భారాన్ని పెంచుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగితే తమ పరిస్థితి ఏమిటని పేద, మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు