మూడేళ్లుగా రిటైర్మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న అంగన్వాడీలు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad district)లో 1984 నుండి మారుమూల గిరిజన గ్రామాల్లో 30 నుండి 40 ఏళ్ల వరకు చిన్నారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన అంగన్వాడీ కార్యకర్తల(Anganwadi Workers)తో పాటు ప్రభుత్వం అందించే పౌష్టికారాన్ని వండిపెట్టిన ఆయాలు రిటైర్మెంట్ పొంది డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉట్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు(Utnoor ICDS Project) పరిధిలో వివిధ గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలుగా, ఆయాలుగా పనిచేసిన వారు జులై 2024 లో పదవి విరమణ పొందారు. పదవి విరమణ(Retirement) పొందినప్పటి నుండి చేతిలో చిల్లిగవ్వ లేక కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు.
రిటైర్మెంట్ పొందిన అంగన్వాడి కార్యకర్తలతో పాటు ఆయాలకు 2022 వరకు రిటైర్మెంట్ పొందిన వారికి 50,000 ల రూపాయలు ప్రభుత్వం అందించేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదవి విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్మెంట్ పొంది మూడేళ్లు అవుతున్న నేటికీ వారికి డబ్బులు అందడం లేదు.
ఈ సమయంలోనే అంగన్వాడీ కార్యకర్తల, ఆయాల సంఘం ప్రతినిధులు రిటైర్మెంట్ పొందిన వారికి రెండు లక్షలు రిటైర్మెంట్ డబ్బు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూపాయలు రెండు లక్షలు చెల్లించుటకు ప్రభుత్వం ఒకపక్క ఒప్పుకున్న నేటికీ డబ్బులు చెల్లించడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డబ్బులు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కొంతమంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు రిటైర్మెంట్ పొందిన వారి ఆలన పాలన చూడడం లేదని అంగన్వాడీ ఉద్యోగం చేసిన సమయంలో తమను పట్టించుకోవడంలేదని వారి పిల్లలను వారిని ఇంటి నుండి కట్టేస్తున్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీలు దుర్భర జీవితం సాగిస్తున్నారని కొంతమంది అంగన్వాడీలు వాపోతున్నారు. ఇప్పటికైనా రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీలకు, ఆయనకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఒక్కపూట తింటున్నాం
ఇందిరా, రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ కార్యకర్త, ధనురా (బి) 1984 నుండి జూలై 2024 వరకు 47 ఏళ్ల పాటు గర్భిణీ స్త్రీల తో పాటు బాలింతలకు , చిన్నారులకు ప్రభుత్వపరంగా సేవలు అందించాను. 2024 లో రిటైర్మెంట్ అయిన తర్వాత నుండి వేతనం లేక ఒక్క పూట భోజనం చేస్తూ.. రెండు పూటలు పస్తులు ఉండవలసి వస్తుంది.
తనతోపాటు పుట్లూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 80 మంది రిటైర్మెంట్ అయ్యారు. దన్నోరా (బీ ) అంగన్వాడీ కేంద్రం నుండి ఆయగా రిటైర్మెంట్ అయిన మహిళా సైతం రోజువారి కూలికి వెళ్లి జీవనం సాగిస్తుంది. రిటైర్మెంట్ అయిన అంగన్వాడిలు, దుర్భర జీవనం సాగిస్తున్న మాపై ప్రభుత్వం కనుకరించి రిటైర్మెంట్ డబ్బులను చేతికి అందించాలని కన్నీరు.. మున్నేరు అవుతు తెలిపింది.