హరీష్‌రావు సొల్లు కబుర్లు చెబుతున్నారు: బీర్ల అయిలయ్య

21-09-2026 | 09:54am
  1. ఆలేరుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు
  2. కరెంటు కోతలపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
  3. పదేళ్ల పాలనలో ఆలేరుకు ఏం చేశారు?
  4. గంధమల్ల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? 

ఆలేరు, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గానికి వచ్చి మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు(Former Minister Harish Rao) పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, కరెంటు కోతల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Aleru MLA Beerla Ilaiah) విమర్శించారు. ఆలేరు నియోజకవర్గానికి హరీష్‌రావు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారడం, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడం వంటి అంశాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ చర్యలు తీసుకుంటోందన్నారు.

గంధమల్ల ప్రాజెక్టుపై నిలదీత

గత పదేళ్ల పాలనలో గంధమల్ల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. ఆలేరు నియోజకవర్గానికి రావాల్సిన నీటి విషయంలో గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ఆలేరుకు వచ్చి తపాస్‌పల్లి నీళ్లను తరలించుకుపోయిన చరిత్ర హరీష్‌రావు ప్రభుత్వానిదేనని ఆరోపించారు.

మోటకొండూరులో అభివృద్ధి కనిపించలేదా?

మోటకొండూరులో సమావేశం నిర్వహించిన హరీష్‌రావుకు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం కాని కార్యాలయాలు కనిపించలేదా అని ప్రశ్నించారు. మోటకొండూరులో ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, డబుల్‌ రోడ్లు, వంగపల్లి–మోటకొండూరు అండర్‌పాస్‌ బ్రిడ్జి వంటి అభివృద్ధి పనులు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విషయం కనిపించలేదా అని నిలదీశారు.

సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌పై ఆరోపణలు

గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సబ్‌స్టేషన్‌కు వెళ్లి లాగ్‌బుక్‌లు అడిగిన సమయంలో అవి అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందని బీర్ల అయిలయ్య ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన విషయాలను ప్రజలు మర్చిపోలేదన్నారు.

“ఆలేరు గడ్డ కాంగ్రెస్ అడ్డా”

తమ పదేళ్ల పాలనలో జరిగిన వ్యవహారాలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని బీర్ల అయిలయ్య అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు చేసి రాష్ట్రంపై భారం మోపారని విమర్శించారు. అసెంబ్లీలో కాళేశ్వరం, ఫామ్‌హౌస్‌ల అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకే హరీష్‌రావు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. గతంలో పార్టీకి చెందిన వారికే తిరిగి కండువాలు కప్పి, ఆలేరులో పెద్ద కార్యక్రమం చేసినట్లు సమావేశాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. హరీష్‌రావు ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా “ఆలేరు గడ్డ కాంగ్రెస్ అడ్డా” అని బీర్ల అయిలయ్య అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విమర్శలు కాకుండా ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని హరీష్‌రావుకు సూచించారు.

మరిన్ని వార్తలు