ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై తల్లిదండ్రుల ఆగ్రహం
- వేలాది రూపాయల ఫీజులు.. వసతులు మాత్రం అంతంతమాత్రమే
- ప్రతి పాఠశాలలో ఫీజుల బోర్డు ఉండాలన్న నిబంధనలు పాటించట్లేదు.
- అంగట్లో సరుకుగా సరస్వతి దేవి
- స్కూల్ డైరీ చిన్నది లాభం పెద్దది
- ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు ఆకాశానికి
బోధన్, సెప్టెంబరు 21(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో(Private Schools) అధిక ఫీజుల వసూళ్లతో పాటు విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన సమయంలోనే వేలాది రూపాయల ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, ఐడీ కార్డులు, బస్సు ఫీజుల పేరుతో అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు. బోధన్ పట్టణంలోని(Bodhan town) కొన్ని పాఠశాలల్లో ఒక్కో పాఠశాలలో 2 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, ఆట స్థలాలు వంటి కనీస సౌకర్యాలు లేవని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మరికొన్ని పాఠశాలలకు విద్యార్థులు ఆడుకునేందుకు సొంత గ్రౌండ్ కూడా లేదని తెలిపారు.
హాస్టళ్లలోనూ వసతుల కొరత
ప్రైవేట్ పాఠశాలలకు అనుబంధంగా నిర్వహిస్తున్న కొన్ని హాస్టళ్లలోనూ విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు హాస్టల్ ఫీజుగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.80 వేల నుంచి రూ.1లక్ష వరకు వసూలు చేస్తున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. తాగునీటి వసతులు సైతం సక్రమంగా లేవని, నీటి ట్యాంకుల నిర్వహణ, శుభ్రతపై నిర్లక్ష్యం కారణంగా పలువురు హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల విద్యార్థుల్లో అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లినప్పుడు తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కొందరు తల్లిదండ్రులు ఆరోపించారు.
ఆటోనగర్ పాఠశాలలో ఫీజులపై వాగ్వాదం
శనివారం ఆటోనగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు చెల్లింపు విషయంలో తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించేందుకు నెల రోజుల గడువు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించలేదని వారు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, ఐడీ కార్డులు, రవాణా చార్జీలు, హాస్టల్ ఫీజుల వసూళ్లపై అధికారులు సమగ్రంగా తనిఖీలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, పారిశుధ్యం, ఆట స్థలాలు, హాస్టల్ వసతులు ఉన్నాయా లేదా అనే అంశాలపై కూడా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, డీఈఓ ప్రత్యేకంగా దృష్టి సారించి బోధన్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ, విద్యార్థులకు కనీస వసతులు కల్పించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.