మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్..పట్టించుకునేదెవరు?
పాల్వంచ, నవంబర్ 03 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో (El Niño) ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించినా క్షేత్రస్థాయిలో ఆచరణ కనిపించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్ (Mission Bhagiratha Pipeline) లీకేజీ కారణంగా తాగునీరు పెద్దఎత్తున వృథా అవుతోంది.
పైప్‌లైన్ లీకేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా స్థాయి అధికారులు పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ కాలనీలో పైప్‌లైన్ నుంచి నీరు ఫౌంటెన్‌లా ఎగసిపడుతున్నా మరమ్మతులు చేపట్టే వారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు నీటిని పొదుపుగా వాడాలని ప్రభుత్వం (Government Orders) సూచిస్తుండగా, మరోవైపు తాగునీరు ఇలా వృథా అవుతుండటంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను (Water Wastage) నివారించాలని కోరుతున్నారు.