అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

25-10-2026 | 07:06pm

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యం. గంగాధర్ యాదవ్

శ్రీరంగాపురం, అక్టోబర్ 25: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని శ్రీరంగాపురం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యం. గంగాధర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి(Sama Rammohan Reddy) గెలుపు కోసం కృషి చేసే దిశగా పట్టభద్రులందరూ ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ముందుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకోవడంతోపాటు తమ స్నేహితులు, సహచర పట్టభద్రులకు కూడా సమాచారం అందించి నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పట్టభద్రులు భాగస్వాములు కావాలని యం. గంగాధర్ యాదవ్ కోరారు.

మరిన్ని వార్తలు