అర్ధరాత్రి హైవేపై భారీ మొసలి కలకలం!
రెండు గంటల పాటు శ్రమించి మొసలిని పట్టుకున్న ఎస్సై, అటవీశాఖ అధికారులు
పెబ్బేరు: వనపర్తి జిల్లా(Wanaparthy District) పెబ్బేరు మండలం తోమాలపల్లె గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి భారీ మొసలి(Crocodile ) ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి సమీపంలో మొసలి కనిపించడంతో అటువైపుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి సుమారు రెండు గంటల పాటు శ్రమించి మొసలిని పట్టుకున్నారు.
సమాచారం అందగానే స్పందించిన ఎస్సై
అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత హైవేపై మొసలి కనిపించిందన్న సమాచారం స్థానిక ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్(SI Venkateswar Goud)కు అందింది. వెంటనే స్పందించిన ఆయన అటవీశాఖ అధికారులైన వెంకటయ్య, శ్రీను, నాగశేష్, వాచర్ వెంకటయ్యతో పాటు గ్రామ సర్పంచ్ అశోక్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. అందరూ సంఘటనా స్థలానికి చేరుకుని మొసలిని సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
రెండు గంటల పాటు ఉత్కంఠ
భారీ ఆకారంలో ఉన్న మొసలిని పట్టుకోవడం అధికారులకు సవాలుగా మారింది. మొసలి నోరు తెరిచి దూసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. తొలుత తాళ్లతో పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ శ్రమించారు. చివరకు చాకచక్యంగా మొసలిని తాళ్లతో బంధించి, గ్రామ సర్పంచ్ సహకారంతో సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేశారు.
కృష్ణానదిలోకి తరలింపు
మొసలిని పట్టుకున్న అనంతరం రంగాపూర్ సమీపంలోని కృష్ణానదిలో విడిచిపెట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. అర్ధరాత్రి హైవేపై భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైనా, పోలీసులు, అటవీశాఖ అధికారులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మొసలిని సురక్షితంగా పట్టుకుని తరలించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్, అటవీశాఖ అధికారులు, సిబ్బందిని తోమాలపల్లె గ్రామ ప్రజలు అభినందించారు.