ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవు
60 శాతంలోపు హాజరున్న బడుల హెచ్‌ఎంలకు నోటీసులు
3 నెలలు ఎఫ్‌ఆర్‌ఎస్ నిబంధనలు పాటించకుంటే 2 ఇంక్రిమెంట్లు కట్
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట,(విజయక్రాంతి): విధులను అలసత్వం చేసే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandlal Pawar) స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ(Education Department) సెప్టెంబరు మాస సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలోని ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించారు.
ఈ సమీక్షాలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ ప్రగతి, అధికారుల తనిఖీలు, స్పాట్ అసెస్‌మెంట్, పీఎంశ్రీ పనులు, మధ్యాహ్న భోజన నాణ్యత, భవిత కేంద్రాల పనితీరుపై ఆయన సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలో ప్రస్తుతం విద్యార్థుల సగటు హాజరు కేవలం 69 శాతం మాత్రమే నమోదు కావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో హాజరు శాతం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. 60 శాతం కంటే తక్కువ హాజరు నమోదైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వెంటనే నోటీసులు జారీ చేసి, లిఖితపూర్వక వివరణ కోరాలని ఆదేశించారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ పాటించకుంటే ఇంక్రిమెంట్లు బంద్:
ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. నెలకు 15 రోజుల కంటే తక్కువ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు ఉన్న ఉపాధ్యాయుల నుంచి తక్షణమే వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఒకే ఉపాధ్యాయుడు వరుసగా మూడు నెలల పాటు ఇదే తీరును పునరావృతం చేస్తే, రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వచ్చే నెల నుంచి మండల స్థాయిలోనే కాకుండా, ఉపాధ్యాయుల వారీగా, అక్టోబర్ 1 నుండి జరిగే సమ్మేటివ్ పరీక్షల ఫలితాల మీద ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, క్వాలిటీ కో-ఆర్డినేటర్ హరికృష్ణ, జిల్లాలోని ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.