విద్యారంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి

01-10-2026 | 12:01am

డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి లింగారెడ్డి

గణపురం,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, ప్రజలు, కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (Democratic Teachers Federation) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి లింగారెడ్డి పిలుపునిచ్చారు. గణపురం మండలం చెల్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Government primary school) ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, డీటీఎఫ్ గణపురం మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అభినందన సభ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని, రాష్ట్రంలో సుమారు 24 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 16 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పద్ధతిలో బోధన సాగుతోందన్నారురాష్ట్రంలోని 33 జిల్లాలకు 23 జిల్లాల్లో డీఈవోలు, 633 మండలాలకు 612 మండలాల్లో పూర్తిస్థాయి ఎంఈవోలు లేరని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు.

పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అన్ని వర్గాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. అశోక్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి మాట్లాడుతూ లక్ష్మారెడ్డి డీటీఎఫ్‌లో నిబద్ధతతో పనిచేసిన కార్యకర్త అని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఉపాధ్యాయ ఉద్యమంలో కొనసాగాలని కోరారు. సన్మాన గ్రహీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డీటీఎఫ్ తన మాతృ సంస్థ అని, భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ ఉద్యమంలో కొనసాగుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మహమ్మద్ అప్రోజ్, కాంప్లెక్స్ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. వీరన్న, రాష్ట్ర కౌన్సిలర్ ఎం. వెంకటేశ్వరాచారి, పి. సుదర్శనం, రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ్యులు దేవదాసు, డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పీఎస్‌హెచ్‌ఎం యూనియన్ జిల్లా బాధ్యులు గణపతి నాయక్, ఎంపీపీ ఎస్ చెల్పూర్ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధువులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు