ఊరి చివర్లో ఎమ్మార్వో ఆఫీస్ వద్దు
మఠంపల్లి సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో తహశీల్దార్ (MRO) నూతన భవనాన్ని ప్రస్తుతం ఉన్న చోటే నిర్మించాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలో నూతన ఎమ్మార్వో భవన(MRO Building) నిర్మాణాన్ని ఊరి పొలిమేర చివర్లో ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోందని నాయకులు తెలిపారు.కార్యాలయాన్ని కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తే సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు,విద్యార్థులు తీవ్ర దూరభారం వల్ల తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం స్ఫూర్తిదాయకం
వేరే చోట భవనం నిర్మించడం వల్ల కొత్త రహదారులు,ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి అదనపు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి అధికారులు ఈ నిర్ణయాన్ని మార్చుకుని, ప్రస్తుతం ఉన్న స్థలంలోనే నూతన భవనాన్ని నిర్మించి ఉమ్మడి సేవలను ప్రజలకు మరింత అందుబాటులో ఉంచాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర నాయకులు ఏసుమల్ల రాములు,మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కాంపాటి సందీప్, జేఏసీ జిల్లా కార్యదర్శి జాల కిరణ్,నరసయ్య,ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు ఇరుగు ప్రభు, సోమయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చయ్య,టీడీపీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.