చిట్ఫండ్ లో అంతా మోసం.?
చిట్టీ కట్టినా.. చెల్లింపు కోసం కన్నీళ్లే!
పాట పాడి 16 నెలలు గడిచినా రూ.7 లక్షలు అందని వేదన..
అధిక పెనాల్టీలు, కొర్రీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ బాధితుడు అర్వపల్లి రామ్మోహన్ రావు అండ్ రేవంత్ ఆరోపణ
ఖమ్మం, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): "అవసరానికి ఆదుకుంటుంది. కష్టకాలంలో ఆసరాగా నిలుస్తుంది" అనే నమ్మకంతో చెమటోడ్చి సంపాదించిన కష్టార్జితాన్ని ఓ చిట్ఫండ్(Chit fund)లో దాచుకుంటే, చివరకు ఆ కుటుంబానికి గుండెకోతే మిగిలచిందని, ఆపదలో ఆదుకోవాల్సిన డబ్బుల కోసం నెలల తరబడి కాళ్ళరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడమే కాకుండా, రకరకాల కొర్రీలు పెడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఇల్లందుకు చెందిన అర్వపల్లి రామ్మోహన్రావు, రేవంత్ కన్నీటి పర్యంతమయ్యారు.
సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు రామ్మోహన్రావు తన ఆవేదనను వెలిబుచ్చారు. ఓ చిట్ ఫండ్ ఇల్లందు బ్రాంచ్ లో రూ. 15 లక్షల విలువైన రెండు చిట్టీలు వేసి, క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వచ్చామని తెలిపారు. అయితే, ఒకసారి బ్రాంచ్ మేనేజర్ కి కట్టిన డబ్బులను సంస్థ ఖాతాలో జమ చేయకుండా కాలయాపన చేసి, తిరిగి తనపైనే భారీగా పెనాల్టీ విధించారని వాపోయారు.
ఈ అన్యాయాన్ని గట్టిగా నిలదీసినందుకు, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇల్లందు బ్రాంచ్ నుండి ఖమ్మం బ్రాంచ్ కు మార్చేసి, తనకు తెలియకుండానే మరో ఇద్దరిని షూరిటీలుగా చేర్చుకున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా, తను పాడని మరో చిట్టీ నుండి పాడిన చిట్టీకి డబ్బును అనధికారికంగా బదిలీ చేశారని, ఖాళీ కాగితాలపై నోటీసుల పేరుతో నాటకమాడుతూ మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టీ పాడి 16 నెలలు గడుస్తున్నా, రావాల్సిన రూ. 7 లక్షల పైకాన్ని (వడ్డీతో సహా) చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కన్నీరు మున్నీరయ్యారు.
చిట్ ఫండ్ యాజమాన్యం తీరుపై ఇప్పటికే చిట్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, ఐజీ, డిఐజీలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి, తనకు రావాల్సిన డబ్బులను వడ్డీతో సహా ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. తక్షణమే న్యాయం జరగకపోతే, చిట్ ఫండ్ వల్ల నష్టపోయిన మిగతా బాధితులను, తమ కుటుంబ సభ్యులను కలుపుకొని కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు.