ఘనంగా బొడ్డెమ్మ పండుగ సంబరాలు!
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), అక్టోబర్ 6: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగను సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మకు తొమ్మిది రోజుల ముందు ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుకలు మహాలయ అమావాస్య వరకు కొనసాగుతాయి. బతుకమ్మ ముత్తైదువల పండుగ కాగా.. బొడ్డెమ్మను కన్నెపిల్లల పండుగగా పెద్దలు చెబుతారు.
గ్రామంలోని బొడ్రాయి వద్ద డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు, ఆడపడుచులు పుట్టమన్ను తీసుకొచ్చి చెక్కపీటపై తొమ్మిది మెట్లుగా బొడ్డెమ్మను ప్రతిష్ఠించారు. ఎర్రమట్టితో అలికి, పసుపు, కుంకుమలతో అలంకరించి, పూలతో ముస్తాబు చేశారు. శిఖరంపై కలశాన్ని ఏర్పాటు చేసి.. పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తున్నారు.
మహిళలు, కన్నెపిల్లలు బొడ్డెమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు (Kolattam) ఆడుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం బొడ్డెమ్మను గ్రామ సమీపంలోని చెరువులో నిమజ్జనం (Immersion) చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుంటోజు వెంకటేశ్వర్లు, కందుల సుమతి తిరుమలరావు, కందుల కీర్తన క్రాంతికుమార్, ఆకుల లావణ్య, ముక్కెర్ల సుమలత, హారిక, ఈశ్వరమ్మ, ఉప్పు సృజన, కాలేరు శృతి, సంధ్య, చల్ల అనసూర్య, నాగలక్ష్మి, ధనమ్మ, మద్దెపూరి సత్తెమ్మ తదితర మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొన్నారు.