జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్
- ఫిబ్రవరి 7న ఫైనల్
- అక్టోబర్ 28న వేలం
- వారణాసిలో మ్యాచ్‌లు ?
ముంబై, సెప్టెంబర్ 16 : మహిళల ఐపీఎల్(Women IPL) కొత్త సీజన్‌కు కౌంట్ డౌన్ మొదలయింది. వచ్చే ఏడాది జరిగే సీజన్‌కు సంబంధించిన టోర్నీ తేదీలు బీసీసీఐ ప్రకటించింది. తాజాగా జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(IPL Governing Council) సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ ఐదో సీజన్ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 7న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే కొచ్చి వేదికగా అక్టోబర్ 28న డబ్ల్యూపీఎల్ వేలం(WPL Auction) నిర్వహించనుంది సెప్టెంబర్ 28 లోగా ఫ్రాంఛైజీలన్నీ ప్లేయర్ల రిటెన్షన్స్ లిస్టు(Player retention list)ను ప్రకటించాల్సి ఉంటుంది.
2026 ఆక్షన్ కోసం 277 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 194 మంది భారతీయులు(Indians) కాగా, 83 మంది ఫారిన్ ప్లేయర్లు. వేలంలో 50 మంది భారత ప్లేయర్లతో పాటు 23 మంది ఫారిన్ ప్లేయర్లు అమ్ముడుపోయారు. మరోవైపు వారణాసిలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. 2027 జనవరి నాటికి స్టేడియం పూర్తిస్థాయిలో సిద్ధమైతే అక్కడ కొన్ని మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.
వారణాసితో పాటు ముంబైలోని బ్రబోర్న్, వడోదరలోని కోటాంబి స్టేడియాలు కూడా వచ్చే ఏడాది డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నట్లు సమాచారం. కాగా మహిళల ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే భారత్లోనే తొలి మహిళల చాంపియన్స్ ట్రోఫీకూడా జరగనుండటంతో 2027 ప్రారంభంలో క్రికెట్ అభిమానులకు నాన్-స్టాప్ వినోదం లభించనుంది.
ఇక ఐపీఎల్‌లో చర్చనీయాంశంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై తుది నిర్ణయం మాత్రం వాయిదా పడింది. ఈ నిబంధనపై అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై మరోసారి చర్చించి.. అక్టోబర్‌లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.