కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ

19-10-2026 | 11:27pm

గజ్వేల్, అక్టోబర్ 19: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ(Saddula Bathukamma) ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉపాధి ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలలో ఉంటున్న ప్రజలంతా సొంతూరికి చేరుకోవడంతో పాటు ఆడపడుచులంతా పట్టణానికి చేరుకొని అందంగా ముస్తాబై తీరొక్క  రంగుల బతుకమ్మలను తయారుచేసి ఆడుకున్నారు. గజ్వేల్ పాండవుల చెరువు, ప్రజ్ఞాపూర్ ఊర చెరువు, ముట్రాజు పల్లి బర్రి చెరువులను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లతో అధికారులు సిద్ధం చేశారు.

గజ్వేల్ పాండవుల చెరువు మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో శోభాయమానంగా విరాజిల్లింది. కుటుంబాలతో సహా తరలివచ్చిన మహిళలు, పురుషులు చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంబరపడ్డారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం వెంట తీసుకువచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకొని ఆరగించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్ పర్సన్  పద్మాబాయి నర్సింగరావు, కమిషనర్ గణేష్ రెడ్డి, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు చేసిన ఏర్పాట్లకు ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు