బైరాన్‌పల్లి అమరుల త్యాగాలను వృథా కానివ్వం
* సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల,సెప్టెంబర్ 16(విజయక్రాంతి): భారతదేశానికి పోరాటాలతో ఓనమాలు నేర్పింది కమ్యూనిస్టు పార్టీ(Communist Party) అని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట 78వ వారోత్సవాల్లో భాగంగా బుధవారం బైరాన్‌పల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం, చారిత్రక బురుజు వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం స్థానిక మండల కన్వీనర్ వలబోజు నర్సింహా చారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బైరాన్‌పల్లి ప్రజలు సాగించిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. 118 మంది అమరులైన బైరాన్‌పల్లి నెత్తుటి చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లి వంటి పోరాట ఖిల్లాలను స్మృతి చిహ్నాలుగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, నాటి పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కిష్టపురం లక్ష్మణ్, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, బెక్కంటి సంపత్, ఆరుగొండ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.