ఇందిరమ్మ మోడల్‌ హౌస్ పనుల్లో కదలిక

01-10-2026 | 06:52pm

విజయక్రాంతి ఎఫెక్ట్‌.. 

- వరుస కథనాలతో స్పందించిన అధికారులు

- అధికారుల ఆదేశాలతో మళ్లీ ప్రారంభమైన నిర్మాణ పనులు

నాగలిగిద్ద,(విజయక్రాంతి): నాగలిగిద్ద మండల(Nagaligidda Mandal) కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏడాదికి పైగా అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ మోడల్‌ హౌస్ నిర్మాణ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నిర్మాణంలో తీవ్ర జాప్యాన్ని ఎత్తిచూపుతూ విజయక్రాంతి పత్రిక వరుసగా ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిలిచిపోయిన మోడల్‌ హౌస్(Indiramma Model House) పనులను తిరిగి ప్రారంభించారు. సెప్టెంబర్‌ 9న ‘ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌కు మోక్షం ఎప్పుడో?’ శీర్షికతో విజయక్రాంతి కథనం ప్రచురించి, నిర్మాణం ప్రారంభించి ఏడాది దాటినా పూర్తి కాకపోవడాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

అయినప్పటికీ పనుల్లో కదలిక లేకపోవడంతో సెప్టెంబర్‌ 22న ‘కథనం వచ్చి నా కదలని పనులు!’ శీర్షికతో మరో కథనాన్ని ప్రచురించి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లింది.వరుస కథనాల నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణ పనులను కొనసాగించాలని ఆదేశించడంతో ప్రస్తుతం పనులు పునఃప్రారంభమయ్యాయి. లబ్ధిదారులకు నమూనాగా ఉపయోగపడాల్సిన మోడల్‌ హౌస్‌ను ఇకనైనా వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రజా సమస్యను వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో పనుల్లో కదలిక రావడం ‘విజయక్రాంతి ఎఫెక్ట్‌’గా నిలిచింది.

మరిన్ని వార్తలు