కరెంట్ ఉచ్చులు పెడితే పీడీ యాక్ట్ కేసులు
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: సీఐ వెంకటేష్
గంభీరావుపేట,(విజయక్రాంతి): అడవి జంతువుల(Wild animals) నుండి పంటలను కాపాడుకునే పేరుతో కరెంట్ షాక్ ఉచ్చులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేష్(Ellareddypet CI O. Venkatesh) హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్(PD Act cases) కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు దంపతులు గంట దేవయ్య, గంట లక్ష్మి కరెంట్ షాక్కు గురై మృతి చెందిన ఘటనను ఆయన గుర్తు చేశారు. అలాగే కొనరావుపేట, రుద్రంగి మండలాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.పంట పొలాల చుట్టూ కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణమైతే, వాటిని హత్య కేసుతో సమానంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. రైతులు, వేటగాళ్లు చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.