ఇంటర్‌ ప్రవేశాలకు ఇదే చివరి అవకాశం

25-10-2026 | 07:23pm

అక్టోబర్‌ 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు అడ్మిషన్లకు అవకాశం

ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత ప్రవేశాలు.. ప్రైవేటు కళాశాలల్లో రూ.500 ఆలస్య రుసుము

జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి దాసరి కల్పన

పెద్దపల్లి, అక్టోబర్‌ 25 (విజయక్రాంతి) : ఇంటర్మీడియట్‌లో(Intermediate) ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యామండలి(Telangana State Board of Intermediate Education) మరో అవకాశం కల్పించింది. అక్టోబర్‌ 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ అనుమతి పొందిన అన్ని కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు అనుమతించినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి దాసరి కల్పన(Dasari Kalpana) తెలిపారు.

ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు(Students) ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల్లో మాత్రం రూ.500 ఆలస్య రుసుముతో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్దేశించిన గడువులోగా తమకు నచ్చిన కళాశాలలో ప్రవేశాలు పొందాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కల్పన సూచించారు. అక్టోబర్‌ 29వ తేదీతో ఈ గడువు ముగియనున్నందున విద్యార్థులు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే అడ్మిషన్లు పొందాలని కోరారు.

మరిన్ని వార్తలు