ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి
విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి,(విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలను(Ganesh Festival) ప్రశాంత వాతావరణంలో, సమన్వయంతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam CP Amber Kishore Jha) పిలుపునిచ్చారు. ఈ నెల 14న గణేష్ చతుర్థి, 25న నిమజ్జనం నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లకు చెందిన హిందూ మత పెద్దలు, గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీపీ మాట్లాడారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి జియోట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జూదం, లక్కీ డ్రాలు, బలవంతపు చందాలు, మద్యం సేవించి రావడం వంటి వాటికి తావివ్వకూడదన్నారు. విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డీజేలు, ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు, పాటలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో పుకార్లు, అసత్య ప్రచారాలు చేయవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.