మున్సిపల్ కార్మికుల పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాం
ఇతర సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
బోధన్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): బోధన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలను చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ)(Telangana Progressive Municipal Workers Union) ఆధ్వర్యంలో కార్మికులు కమిషనర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలు, పారిశుధ్య కార్మికులకు పనిముట్ల సరఫరా, మృతి చెందిన, అనారోగ్యానికి గురైన, పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానాల్లో వారి వారసులకు ఉపాధి కల్పించే అంశాలపై చర్చించారు.
యూనియన్ నాయకుడు బి. మల్లేష్ మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన వేతన బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా పలుమార్లు వినతిపత్రాలు అందజేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గతంలో రూ.53 లక్షలను వేతన బకాయిల చెల్లింపునకు కేటాయించినట్లు కమిషనర్ తెలిపారని, అయితే రెండు నెలల బకాయిలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని నిలిపివేశారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పారిశుధ్య విభాగంలో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు అందించకపోవడంతో వారు సొంత డబ్బులతో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అవసరమైన పనిముట్లతో పాటు బ్లౌజులు, చెప్పులు, బూట్లు, సబ్బులు, నూనె తదితర వస్తువులను వెంటనే అందించాలని కోరారు.
దీనిపై కమిషనర్ యాదవ్ కృష్ణ స్పందిస్తూ.. పనిముట్ల కొనుగోలుకు రూ.4 లక్షలతో టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే కార్మికులకు అవసరమైన పనిముట్లతో పాటు ఇతర వస్తువులను అందజేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ వేతన బకాయిలను కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు. మృతి చెందిన, అనారోగ్యానికి గురైన, పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులను విధుల్లోకి తీసుకునే అంశానికి సంబంధించి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించామని, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికుల ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) బోధన్ పట్టణ నాయకులు బి. పర్వయ్య, కె. గంగామణి, ఎం. అబ్బయ్య, లావణ్య, మరియమ్మ, కె. శంకరమ్మ, జి. లక్ష్మి, ఎం. సాయమ్మ, పి. లక్ష్మి, పి. సరోజ తదితరులు పాల్గొన్నారు.