ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే
నిర్మల్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో "ఫ్రెషర్స్ పార్టీ" (నూతన విద్యార్థుల స్వాగతోత్సవం) నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ మరియు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం(Alumni Association) అధ్యక్షుడు ఈ. ముత్యం రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ అనేది జీవితానికి బలమైన పునాది వేసుకునే అత్యంత కీలకమైన సమయమని తెలిపారు. డిగ్రీ స్థాయిలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్పష్టమైన లక్ష్యంతో శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పిలుపునిచ్చారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా సమాజంలో ఉన్నత హోదాలో నిలబడడం తనకు ఎంతో గర్వకారణమని, పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి కమ్యూనికేషన్, డిజిటల్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు.