కులవృత్తులు కనుమరుగవుతున్న వేళ.. విశ్వబ్రాహ్మణులకు అండ ఏదీ?
కాట్రియాలలో ఘనంగా విశ్వకర్మ జయంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని సంఘం డిమాండ్..
కాట్రియాల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తరతరాలుగా కులవృత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న విశ్వబ్రాహ్మణుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని, ఆధునిక కాలంలో సంప్రదాయ వృత్తులు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వం తమకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని విశ్వబ్రాహ్మణులు(Viswabrahmin community) కోరారు. తమ చేతివృత్తులకు ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందించి భవిష్యత్ తరాలకు కులవృత్తులను వారసత్వ సంపదగా అందించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని గురువారం కాట్రియాల గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణ కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట జెండాను ఆవిష్కరించి విశ్వకర్మ భగవానుడికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో తమ కులవృత్తులు ఎంతో కీలకమైన పాత్ర పోషించాయని గుర్తు చేశారు. అయితే కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు, ఆధునిక యంత్రాల ప్రభావంతో సంప్రదాయ చేతివృత్తులు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తినే జీవనాధారంగా చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.