త్యాగాల పునాదులపై ప్రజా పాలన..!

17-09-2026 | 09:18pm

అమరుల స్ఫూర్తితో తెలంగాణ ప్రగతి పథంలో..

రామాయంపేట, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తొలి దశ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎందరో అమరుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగుతోందని రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు(Municipal Chairperson Gajawada Lavanya Nagaraju) అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు సూచనల మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన దినోత్సవం ను గురువారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ  తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన కృషి చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు వేసిన ఆమెకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని అన్నారు.

అమరుల త్యాగాలే తెలంగాణకు పునాది.. ప్రజల సంక్షేమమే ప్రజా పాలనకు ప్రాణం అని పేర్కొంటూ, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు, చౌదరి చరిత, మద్దెల మాధవి, దేవుని రంజిత్, గూగుల్ రవి, డాకి శ్యామల స్వామి. కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు