వ్యాపారులు ఏంచేస్తారో!

16-09-2026 | 05:30am

అక్టోబర్ 15 నుంచి కొత్తగా యూపీఐ చార్జీలు

  1. రూ.2 వేల వరకు నో చార్జ్.. ఆపై 0.4 శాతం ఎండీఆర్ 
  2. ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 
  3. చిరు వ్యాపారులకు ఊరట
  4. ఎంపిక చేసిన సేవలకు ఒక్కో లావాదేవీపై రూ.5 వరకు రుసుము 
  5. వ్యక్తుల మధ్య చెల్లింపులకు చార్జీల్లేవు 
  6. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో 24.51 బిలియన్లు 
  7. డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతమిచ్చేలా కేంద్ర నిర్ణయం
  8. ప్రజలపై ప్రత్యక్ష భారం: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే 
  9. అమెరికా ఒత్తిడికి తలొగ్గారు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: యూపీఐ చార్జీ(UPI charge)ల్లో కొత్త విధానం అమల్లోకి రానుంది. రూ.2 వేల వరకు చేసే చెల్లింపులకు ఎలాంటి భారం ఉండదు. అంతకు మించిన లావాదేవీలపై 0.4 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్(Merchant Discount Rate) (ఎండీఆర్) చెల్లించాల్సి ఉంటుంది. కొత్త విధానం అక్టోబర్ 15నుంచి అమల్లోకి రానుంది.

ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్(Payment and Settlement Systems Act) 2007 సెక్షన్ 10ఏ కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ(Ministry of Finance) ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఐ ద్వారా రూ.2వేల వరకు చేసే చెల్లింపులపై ఎలాంటి చార్జీలు విధించరాదని బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లను(Banks and service providers) ఆదేశించింది. రూపే డెబిట్ కార్డుల(RuPay debit cards) ద్వారా చేసే చెల్లింపులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.  

రూ. 2వేలు దాటితే చార్జీ..

2 వేలు పైబడిన చెల్లింపులపై 0.4 శాతం చార్జి వర్తించనుంది. దీన్ని వినియోగదారుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి బ్యాంకులు వసూలు చేయనున్నాయి. అయితే ఒక్కో లావాదేవీపై గరిష్టంగా రూ.300కు పరిమితి విధించింది. నెలకు లక్ష రూపాయల వరకు డిజిటల్ ద్వారా స్వీకరించే చిన్నవ్యాపారస్తులకు ఎండీఆర్ వర్తించబోదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి ఎంపిక చేసిన కేటగిరీల్లో రూ.2వేలకు మించిన చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ.5 వరకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక వ్యక్తుల మధ్య (పీ2పీ) చెల్లింపులకు ఎలాంటి చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం విధానం యథాతథంగా కొనసాగనుంది. 

డిజిటల్ పేమెంట్ వ్యవస్థ బలోపేతానికే..   

దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు భారీగా విస్తరిస్తున్నాయి. ఈనేపథ్యంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. గత నెలలో యూపీఐ ద్వారా 24.51 బిలియన్ లావాదేవీలు జరగగా, వీటి మొత్తం విలువ రూ.29.82 ట్రిలియన్లుగా నమోదైంది. మొత్తం లావాదేవీల పరిమాణంలో దాదాపు మూడు వంతులను గూగుల్ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే నిర్వహించాయి. పెద్ద మొత్తాల్లో జరిగే వ్యాపార లావాదేవీలపై చార్జీలు విధించే అవకాశం వస్తే, అది బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు కొత్త ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇలాంటి చార్జీల ద్వారా చెల్లింపు పరిశ్రమకు ఏటా రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని జెఫరీస్ అనే సంస్థ గత నెలలో అంచనా వేసింది. అయితే అటు వినియోగదారుడికి, ఇటు వ్యాపారికి ఎలాంటి భారం పడకుండా యూపీఐలో ఈ కొత్త చార్జీల విధానం అమలుకావాలని ప్రభుత్వం బ్యాంకులకు నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో వ్యాపారులు వినియోగదారుల నుంచి నగదు లావాదేవీలను కోరుతారా, లేక వస్తు ధరలనే పెంచుతారా అనేది వేచి చూడాల్సిందే.

ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ ‘యూపీఐ’

భారతదేశంలోని యూపీఐ నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. 2026 జూలై నాటికి 741 బ్యాంకులు యూపీఐతో అనుసంధానించబడగా.. రూ.29.88 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతం వాటాగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నందన్ నీలేకని ఆధ్వర్యంలో 2016 ఏప్రిల్ 11న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)ను ప్రారంభించింది. 2016 రూ.2 వేల కోట్ల లావాదేవీల నుంచి 2025 నాటికి 24,162 కోట్లకు పెరిగాయి. 

ప్రజల పొదుపును లాగేసే ప్రయత్నం: మల్లికార్జున ఖర్గే

డిజిటల్ చెల్లింపులపై పన్ను విధించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ప్రజలు చేసుకుంటున్న పొదుపును కూడా లాగేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్న ప్రజలపై కేంద్రం ప్రత్యక్ష భారాన్ని మోపుతోందంటూ మంగళవారం ఖర్గే ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్ ఇచ్చిందని, డిజిటల్ చెల్లింపులను ముందుపెట్టి తప్పించుకుందన్నారు. రూ.5వేల లావాదేవీలపై రూ.25, రూ. 10వేల లావాదేవీలపై రూ. 50 పన్ను విధించే అవకాశం ఉందని ఇదే నిజమేనా? అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఖర్గే ప్రశ్నించారు.

నూతన విధానంపై స్పష్టత లేదు: రాహుల్‌గాంధీ 

ప్రజలపై యూపీఐ పేరుతో పన్నులు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసుకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. అమెరికా (ట్రంప్) ఒత్తిడికి తలొగ్గే ఈ చర్యలు తీసుకున్నారని విమర్శించారు. 2వేల పైబడిన లావాదేవీలపై వ్యాపారులపై చార్జీలు విధిస్తారా? లేక ప్రజలపైనా? అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదరన్నారు. దేశంలో యూపీఐ లావాదేవీల శాం 65 శాతంగా ఉందన్నారు.

భారత్‌లోని జీరో ఎండీఆర్ పాలసీని అమెరికా పేమెంట్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయని, వాటి ఆకాంక్షలకు అనుగుణంగానే దేశ ఆర్థిక విధానంలో మోదీ మార్పులు చేశారని, అమెరికా వాణిజ్య ఒప్పందంతో రాజీపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారుల నుంచి ప్రభుత్వం ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని చెబుతున్నా, మరీ దుకాణదారులపై విధించే పన్నులు చివరికి ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. 

యూపీఐ కొత్త చార్జీలు ఇలా..

రూ.2000 వరకు :           నిల్ 

2వేలకు పైగా         :          0.4% ఎండీఆర్

ఎండీఆర్ పరిమితి :    రూ.300

ఎంపిక చేసిన సేవలకు (రైల్వేలు, టెలికాం, బీమా, ఇందనం వంటివి) : ఒక్కో లావాదేవీపై రూ.5 

వ్యక్తుల మధ్య (పరిమితి లేదు) : నిల్ 

మరిన్ని వార్తలు