విద్యార్థినిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
- గురుకులంలో విద్యార్థుల భద్రతపై సమగ్ర విచారణ జరపాలి
- డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి డిమాండ్
మునుగోడు, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మునుగోడు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన తీవ్రంగా బాధాకరమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి(DYFI District Assistant Secretary Katta Lingaswamy) అన్నారు.
రెండు రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన విద్య అందుతుందనే నమ్మకంతో గురుకుల పాఠశాలలకు పంపిస్తున్నారని, విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదని అన్నారు.
గురుకుల పాఠశాలలో గతంలోనూ వివిధ సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థినిపై జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే మెనూ ప్రకారం భోజనం అందడం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో, వారు విద్యార్థి సంఘాలను ఆశ్రయించినందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై కూడా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు.విద్యార్థినులపై ఎలాంటి వేధింపులు, దాడులు, కక్షసాధింపు చర్యలకు తావులేకుండా గురుకులంలో సురక్షిత వాతావరణం కల్పించాలని, ఆరోపణలు నిజమని విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కట్ట లింగస్వామి డిమాండ్ చేశారు.