‘జంగా’ గ్లింప్స్ అదుర్స్!

13-11-2026 | 06:59pm

హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు 10(Bigg Boss Telugu 10)లో తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న నటుడు త్రిగుణ్(Actor Trigun).. ఇప్పుడు వెండితెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జంగా’ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటివరకు కనిపించిన ఇమేజ్‌కు భిన్నంగా ఈ సినిమాలో త్రిగుణ్ శివ అనే పాత్రలో రఫ్ అండ్ రస్టిక్ అవతారంలో కనిపించనున్నారు. మనిషిలోని మానవత్వం, పశుప్రవృత్తి మధ్య సంఘర్షణను ప్రతిబింబించేలా గ్లింప్స్‌ను రూపొందించారు. సైకిల్‌పై సీసాతో కనిపించే త్రిగుణ్ లుక్ పాత్రపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘కొన్ని లక్షల ఏళ్లు పట్టింది పశువు మనిషి అవ్వడానికి.. మళ్లీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను’ అంటూ వినిపించే సంభాషణ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటెన్స్ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్(Varalaxmi Sarathkumar) కీలక పాత్రలో కనిపించనున్నారు. గన్ పట్టుకుని ఆమె కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేహా పాఠాన్ కథానాయికగా నటిస్తుండగా, మధునందన్, శ్రావణ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

కెవిన్ గడ్డం (శ్రీహరి) కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆర్‌కే ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్నారు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ, కృష్ణ సౌరభ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. బిగ్‌బాస్‌లో త్రిగుణ్ ఆటను చూస్తున్న అభిమానులకు ఆయన కొత్త సినిమా గ్లింప్స్ మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌గా మారింది. మరి ‘జంగా’తో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


మరిన్ని వార్తలు