బాల్యం.. అ‘మూల్యం’!

14-11-2026 | 05:00am

‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది.’ మరి నేటి తరగతి గదులను, పసిడి మనసులను ఏ శక్తులు శాసిస్తున్నాయి? అర చేతిలో ఇమిడిన సాంకేతికత విజ్ఞానాన్ని పంచుతున్నదా? లేక బాల్యాన్ని విషవలయంలోకి నెడుతున్నదా? మార్కులు, ర్యాంకుల పరుగులో మనం కోల్పోతున్న మానవ విలువలెన్ని? ‘చాచా నెహ్రూ’ ఆశయాలను స్మరించు కుంటూ.. ఆయన జయంతి.. బాలల దినోత్సవం(Children's Day) రోజున పెడదోవ పడుతున్న బాల్యంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

బాల్యం అనగానే ఆటపాటలు, అల్లరి చేష్టలు, అమ్మానాన్నల ఆప్యాయతలు, అమ్మమ్మ తాతయ్య చెప్పే కథలు గుర్తుకొస్తాయి. పూల తోట లో విచ్చుకున్న పువ్వుల్లాంటి పసిమనసులకు లేత వయసులో అలవడే సంస్కారం, విలువలే జీవితానికి పునాదులు. అలాంటి బంగారు బాల్యాన్ని ప్రేమ, విజ్ఞానంతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిదీ. 

పిల్లలే దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలని నమ్మిన వ్యక్తి.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. చిన్నారులు ఆప్యాయంగా ‘చాచా నెహ్రూ’ అని పిలిచేవారు. బాలల విద్య, సంక్షేమం, సర్వతోముఖ వికాసా నికి ఆయన ప్రాధాన్యమిచ్చారు. మరి నేడు బాల్యం ఏ దారిలో పయని స్తోంది? అనేది ఆలోచించాల్సిన అంశం.

ఒకప్పుడు ఆటస్థలాలు, ప్రకృతి ఒడి, ఉమ్మడి కుటుంబాల మధ్య బాల్యం ఆనందంగా గడిచేది. నేడు ఆ పరిస్థితులు లేవు. మార్కులు, ర్యాం కులు, పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెరుగుతున్న సాంకేతికత, దాని విచక్షణారహిత వినియోగం బాల్యానికి ముప్పుగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ఆటలకు చిన్నారులు బానిసలవుతున్నారు. గంటల తరబడి తెరలకు అతుక్కుపోవ డంతో ఆటలు, కుటుంబ సంబంధాలకు దూరమవుతున్నారు. హింసాత్మ క, అసభ్యకర దృశ్యాలు వారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.  

దీనికి తోడు మత్తు పదార్థాల మాయా ప్రపంచం విద్యార్థుల పాలిట శాపంగా తయారైంది. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల ఉచ్చులో చెడు స్నేహాలు, దురలవాట్లు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి. చిన్నచిన్న కారణాలకే ఘర్షణలు, దాడులకు దిగడం, ఉపాధ్యాయులపైనా దురుసుగా ప్రవర్తించడం గురుశిష్య సంబంధాల్లో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది.  

 మసకబారుతున్న విలువలు : ‘మొక్కై వంగనిది మానై వంగదు’ అన్న నానుడి పిల్లల పెంపకానికి చక్కగా సరిపోతుంది. చిన్నతనం నుంచే గౌర వం, క్రమశిక్షణ, ప్రేమ, దయ, సహనం నేర్పాలి. పెద్దలను ఆదరించడం, టీచర్లను గౌరవించడం అలవర్చాలి. భయంతో సాధించే క్రమశిక్షణ కంటే ప్రేమతో నేర్పించే మార్గదర్శకత్వమే మేలు. విద్య అంటే మార్కులు, ర్యాం కులు మాత్రమే కాదు.  సంస్కారం అలవడినప్పుడే దానికి సార్థకత.

 బాధ్యత అందరిదీ: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, ప్రభుత్వం, సమాజం.. అందరి పాత్ర కీలకం. అందుకు పెద్దలు తగిన సమయం కేటాయించాలి. పిల్లల ఆలోచనలు, అలవాట్లను గమనిస్తూ తప్పులను ప్రేమతో సరిదిద్దాలి. ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టాలి. బాలల భద్రత, విద్యకు భరోసా కల్పించాలి. 

మార్పు మనతోనే మొదలవ్వాలి: బాలల దినోత్సవం వేడుకలు, ప్రసంగాలకే పరిమితం కావద్దు. పిల్లలకు  నాణ్యమైన విద్య, రక్షణ, ఆటపాటలు, సమానావకాశాలు కల్పించాలి. వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహిం చాలి. మన ఆశయాలను బలవంతం గా రుద్దకూడదు. నేటి బాలలే రేపటి భారత నిర్మాతలు. చాచాజీ ఆశయాలను ఆచరణలో చూపడమే నిజమైన నివాళి. బాల్యాన్ని కాపాడుకోవడ మంటే భావి భారతాన్ని కాపాడుకోవడమే!

జర్నలిస్టు -9848772232

గడగోజు రవీంద్రాచారి 

మరిన్ని వార్తలు