త్రివిక్రమ్ సినిమాలకు భిన్నంగా!

27-10-2026 | 05:30am

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్(Victory Venkatesh, Trivikram Srinivas) కలయికలో రూపొందుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం  హౌస్ నెం. 47. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ నెల 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. 20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమాకు ఎందుకు ఓకే చెప్పారు?

త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక నాకు ముందు నుంచి ఉంది. అలాంటిది ఆయన నుంచి పిలుపు రావడం సంతోషంగా అనిపించింది. పైగా ఇది త్రివిక్రమ్ గారికి, వెంకటేష్(Venkatesh) గారికి కూడా కొత్త జానర్. త్రివిక్రమ్(Trivikram) గారి ఫిల్మోగ్రఫీని గమనిస్తే, ఆయన సినిమాలకు పూర్తి భిన్నంగా ఆదర్శ కుటుంబం ఉంటుంది. అందుకే కథ వినగానే ఈ చిత్రంలో ఖచ్చితంగా భాగం కావాలి అనుకున్నాను. నాది అమ్మ పాత్ర అయినప్పటికీ, సినిమాకి నో చెబుదామనే ఆలోచన ఒక్క క్షణం కూడా కలగలేదు. ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి. 

మీ పాత్ర ఎలా ఉంటుంది? 

కామెడీ చేయడం ఎలా ఉంది?

త్రివిక్రమ్ చెప్పినట్లు ఇది క్రైమ్ కామెడీ మూవీ. డార్క్ కామెడీ ఉంటుంది. నేను మొదటిసారి కామెడీ పాత్ర చేశాను. నేను చిట్ ఫండ్‌లో డబ్బులు పోగొడతాను. మొత్తం అప్పులు చేసేస్తాను. ఇప్పటిదాకా ఈ తరహా పాత్రలు చేయకపోవడంతో ఎలా చేస్తాననే సందేహం మొదట కాస్త కలిగినా.. అవుట్ పుట్ చూసుకున్న తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది. 

డైలాగుల గురించి చెప్పండి

త్రివిక్రమ్ డైలాగుల్లో ఎంతో భావం ఉంటుంది. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. రైటింగ్‌లో ఆయన మ్యాజిక్ కనిపిస్తుంది. ట్రైలర్‌లోని చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్ అనే డైలాగ్ అయితే నాకు మాత్రమే కాదు, అందరికీ ఎంతగానో నచ్చింది.

ఆలస్యంగా విడుదల కావడంపై నిరాశ చెందారా?

ఒక సినిమాపై ఏడాదిన్నర కష్టపడి, అవుట్ పుట్‌ను ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పుడు, కంగారుపడి విడుదల చేసే కంటే కాస్త ఆలస్యంగా రావడంలో తప్పులేదు. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా చెప్పారు. మెరుగైన అవుట్ పుట్ కోసమే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30 కి విడుదల తేదీ మార్చారు. 

మీరు తక్కువ సినిమాలు చేయడానికి కారణం?

కంటెంట్ పరంగా నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఆదర్శ కుటుంబం కూడా నా మనసుకి నచ్చి ఎంపిక చేసుకున్న సినిమానే. అయితే నేను చేస్తున్న పెద్ద సినిమాలు ఏడాది రెండేళ్లు సమయం తీసుకుంటున్నాయి. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నాను అనిపిస్తుంది. 

వెంకటేష్‌తో నటన ఎలా ఉంది?

వెంకటేష్ అద్భుతమైన నటుడు. ఆయనను మ్యాచ్ చేయడం అనేది సాధ్యం కాదు. కానీ, నా వంతుగా ప్రయత్నించాను. ముఖ్యంగా త్రివిక్రమ్ సూచనలతో కామెడీ సన్నివేశాల్లో సహజంగా నటించడానికి ట్రై చేశాను. 

సినిమా చూశారా? ఎలా అనిపించింది?

ఇటీవలే చూశాను. చాలా నచ్చింది. ఆదర్శ కుటుంబం సినిమా ఎలా ఉంటుంది అనేది నాకు ముందే తెలుసు. షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమా చూసినప్పుడు అంతకుమించిన ఆనందం కలిగింది.

త్రివిక్రమ్ గారి గురించి?

త్రివిక్రమ్ ఎంతో గొప్ప దర్శకుడు. త్రివిక్రమ్ గారిని కలిసిన తర్వాత ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి తెలిసింది. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎందుకు అలా వింటూ ఉండిపోతారో అర్థమైంది. అంత సీనియర్ దర్శకుడైనా సరే సినిమా కోసం చర్చించడానికి ఎప్పుడూ ముందుంటారు. సెట్ లో మంచి వాతావరణం ఉండేలా చూస్తారు. నటీనటులకు కంఫర్ట్ ఇస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటీనటులకు ఎంతో సపోర్టుగా నిలుస్తారు. 

మరిన్ని వార్తలు