షిరిడీ సాయిబాబా సన్నిధిలో రామ్ చరణ్.. ప్రత్యేక పూజలు!

13-11-2026 | 07:22pm

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. శుక్రవారం సాయిబాబా ఆలయానికి(Sai Baba Temple) చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రామ్ చరణ్ ఆలయానికి చేరుకోగానే అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో ఆయనను గౌరవించి సాయినాథుడి ఆశీస్సులు అందించారు. దర్శనం అనంతరం సాయిబాబా ప్రతిమను జ్ఞాపికగా బహూకరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఆయన దర్శనానికి సంబంధించిన దృశ్యాలు అభిమానుల మధ్య వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు.

సృజనాత్మక దర్శకుడు సుకుమార్‌(Director Sukumar)తో రామ్ చరణ్ మరోసారి జతకట్టడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా RC17 అనే పేరు ప్రచారంలో ఉంది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకోవడంతో కొత్త సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈ ప్రాజెక్టులో కథానాయికగా ఎవరు నటిస్తారనే అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఆధ్యాత్మిక పర్యటనతో వార్తల్లో నిలుస్తున్న రామ్ చరణ్.. మరోవైపు సుకుమార్‌తో సినిమా ద్వారా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు