‘ఇట్లు అర్జున’ ఎలా ఉందంటే?
ప్రేమకథకు క్రైమ్ థ్రిల్లర్ టచ్.. తమన్ సంగీతం సినిమాకు బలమా?
టాలీవుడ్‌లో మరో కొత్త హీరో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అనీశ్ హీరోగా, మలయాళ నటి అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించగా, వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించారు. అక్కినేని నాగార్జున సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు విడుదలకు ముందే స్టార్ హీరోల ప్రచారం మంచి క్రేజ్ తీసుకొచ్చింది. నవంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?
కథేంటి?
చిన్నతనం నుంచే మాటలు రాని అర్జున్ (అనీశ్) దొంగతనాల నేపథ్యంలో పెరుగుతాడు. అయితే తండ్రికి ఇచ్చిన మాటతో ఆ జీవితానికి దూరమవుతాడు. తనకు పరిచయమైన కీర్తి (అనశ్వర రాజన్)ను మనసులో ప్రేమిస్తున్నా, ఆ విషయాన్ని బయటపెట్టలేకపోతాడు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో ఓ భారీ క్రైమ్ వ్యవహారం వారి జీవితాలను మలుపు తిప్పుతుంది.
మరోవైపు హైదరాబాద్‌లో పేరుమోసిన డాన్ పెద్దన్న (ముఖేష్ రిషి)కు సంబంధించిన కీలక సమాచారం ఉన్న పెన్‌డ్రైవ్ కోసం వేట మొదలవుతుంది. ఈ వ్యవహారంలో అర్జున్ చిక్కుకుంటాడు. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది? అర్జున్ ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు? కీర్తితో ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది తెరపై చూడాలి.
సినిమా ఎలా ఉంది?
సాధారణ ప్రేమకథకు గ్యాంగ్‌స్టర్ నేపథ్యాన్ని జోడించి దర్శకుడు కథను ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హీరో మూగవాడిగా కనిపించడం కథకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. మాటలు లేకుండానే భావాలను వ్యక్తపరిచే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల మధ్య పరిచయం, ప్రేమ సన్నివేశాలు, కామెడీతో సినిమా వినోదాత్మకంగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే మలుపు కథపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో పెన్‌డ్రైవ్, గ్యాంగ్‌స్టర్ వ్యవహారం ప్రధానంగా మారతాయి. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం, క్రైమ్ ట్రాక్ ఆశించినంత బలంగా లేకపోవడం మైనస్‌లుగా నిలుస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే పరిణామాలు కొంత ఆసక్తిని కలిగించినా, కథలోని కీలకమైన హవాలా వ్యవహారానికి మరింత బలమైన ముగింపు ఉంటే బాగుండేది.
నటీనటుల పనితీరు
అనీశ్‌కు ఇది తొలి సినిమా అయినా, సవాలుతో కూడిన మూగవాడి పాత్రను ఎంచుకోవడం విశేషం. సంభాషణలు లేకుండా హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో భావాలను పలికించే ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో తనదైన ముద్ర వేస్తాడు.
కీర్తి పాత్రలో అనశ్వర రాజన్ సహజంగా నటించింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. పెద్దన్నగా ముఖేష్ రిషి తన అనుభవంతో పాత్రకు బలం చేకూర్చారు. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ అక్కడక్కడా నవ్వులు పంచుతారు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
సాంకేతిక విభాగం
సినిమాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు మంచి బలాన్నిచ్చింది. రాజా మహాదేవన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు మహేష్ ఉప్పల కొత్త ప్రయత్నం చేసినప్పటికీ, స్క్రీన్‌ప్లేలో మరికొంత శ్రద్ధ పెట్టాల్సింది.
ఫైనల్‌గా..
కొత్త హీరో అనీశ్‌కు ‘ఇట్లు అర్జున’ మంచి పరిచయ చిత్రంగా నిలుస్తుంది. అనశ్వర నటన, తమన్ సంగీతం, ఫస్టాఫ్ వినోదం సినిమాకు ప్రధాన బలాలు. అక్కడక్కడా నెమ్మదించే కథనం, బలహీనమైన క్రైమ్ ట్రాక్ కొంత నిరాశపరుస్తాయి. ప్రేమకథలు, క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ఒకసారి చూడదగిన సినిమా.
ట్యాగ్‌లైన్: లవ్.. క్రైమ్ థ్రిల్లర్..
రేటింగ్: 2.75/5