సంగీత దిగ్గజానికి ఆస్ట్రేలియా ఘన గౌరవం!

23-09-2026 | 05:13pm

50 ఏళ్ల సంగీత ప్రయాణానికి గుర్తింపుగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల

మెల్‌బోర్న్: భారతీయ సినీ సంగీతానికి తనదైన బాణీని అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో ప్రత్యేక గౌరవం లభించింది. ఆయన సినీ సంగీత ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెల్‌బోర్న్‌లోని విక్టోరియా పార్లమెంట్‌(Parliament of Victoria)లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళయరాజా(Ilaiyaraaja) చిత్రంతో కూడిన స్మారక పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. విక్టోరియా ఆర్థిక మంత్రి ఎన్వర్ ఎర్డోగాన్(Victorian Finance Minister Enver Erdogan) ఎంపీతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం నుంచి సంగీత ప్రపంచంలోకి వచ్చిన తనకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో లభించిన ఈ గుర్తింపు ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని ఇళయరాజా తెలిపారు. తన సంగీత ప్రయాణంలో తోడుగా నిలిచిన కళాకారులు, అభిమానులు, వివిధ తరాల శ్రోతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇళయరాజా 50 ఏళ్ల సినీ సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని పలు దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26న సిడ్నీలో, అక్టోబర్ 5న బ్రిస్బేన్‌లో కార్యక్రమాలు జరగనున్నాయి.


మరిన్ని వార్తలు