గడ్డం తీసేసినా ఆమె పాత్రలో మెప్పించలేను!

17-09-2026 | 05:30am

ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్

ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్(MS Subbulakshmi Biopic) ప్రారంభమైంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు(Prominent Tollywood producers) అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేశ్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తున్నారు. ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి(Bharat Ratna M.S. Subbulakshmi)’ పేరుతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ బయోపిక్‌కు అనిరుధ్ రవిచంద్రన్ సంగీత సారథ్యం వహించనున్నారు. బుధవారం సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ప్రారంభించారు.

చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రష్మికపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కమల్‌హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ వేడుకలో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. “తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత దేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి సుబ్బులక్ష్మి అమ్మ. ఆమె ఏ భాషలో పాట పాడినా అది భాషకే అందం తెచ్చేలా ఉండేది. ఆమె సంగీతమే మనకు అందించిన సందేశం. సుబ్బులక్ష్మి అమ్మ నాలో ఎంతో స్ఫూర్తి నింపారు.

అమ్మ ఆలపించిన సుప్రభాతం, లలితసహస్రనామం, రంగపుర విహార పాటలు వింటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మహాత్మాగాంధీ కూడా సుబ్బులక్ష్మి అభిమాని. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేశ్, బన్నీవాస్ ప్రొడక్షన్లలో చేస్తున్న గొప్ప చిత్రమిది. అనిరుధ్ సంగీత ప్రస్థానం కూడా ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లబోతోంది. దర్శకుడు గౌతమ్‌పై చాలా బాధ్యత ఉంది. ఎంఎస్ అమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న రశ్మికను చూస్తే నేను అసూయపడటం లేదు. గడ్డం తీసేసినా నేను ఆమె పాత్రలో నటించి మెప్పించలేను.

ఈ దేశ మహిళల్లో విశ్వాసాన్ని నింపిన ఐకానిక్ వుమెన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ” అన్నారు. హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. “నటిగా నాకు ఈ గొప్ప అవకాశం దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపోతోంది. ఈ వేదిక మీద నిల్చున్నందుకు దేవుడి సమక్షంలో ఉన్న భావన కలుగుతోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగంగా మారుతున్నందుకు ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నా. ఎంఎస్ అమ్మ పాత్రను అందరికీ నచ్చేలా పోషించేందుకు సంపూర్ణ ప్రయత్నం చేస్తా” అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఈ ఆడిటోరియంలో సుబ్బులక్ష్మి అమ్మ చిత్రపటం చూడగానే కాసేపు భావోద్వేగానికి లోనయ్యా. ఆమే మమ్మల్ని ఈ సినిమా చేసేందుకు ఎంచుకుందనే భావన కలిగింది. రశ్మికనూ ఆమే ఎంచుకుందపించింది. ఎంఎస్ అమ్మ గొప్ప సంగీతకారిణిగా తెలుసు. కానీ ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. మా దర్శకుడు గౌతమ్, ఆయన టీమ్ గత ఏడాదికాలంగా బయోపిక్ రీసెర్చ్‌లో భాగంగా గ్రేట్ వర్క్ చేశారు.

ఆమె సంగీతాన్ని రీక్రియేట్ చేసే సాహసం మేము చేయడం లేదు. అనిరుధ్ సంగీతంతో ఒక గొప్ప బయోపిక్ రూపొందిస్తున్నాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం” అని చెప్పారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ.. “గతేడాదిగా మా టీమ్‌కి ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ పేరు ఒక మంత్రం అయ్యింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఆమె ఒక అసాధారణ జీవితాన్ని చూసినవారని అర్థమైంది. ఇదొక కీలకమైన సినిమా అని నమ్ముతున్నాం. ఈరోజు గుర్తింపు అనేది రాత్రికి రాత్రే దక్కుతోంది.

లైక్స్, షేర్స్, సబ్‌స్క్రైబర్స్ రూపంలో ఫేమ్‌ను, సక్సెస్‌ను కొలుస్తున్నాం. కానీ ఎంఎస్ అమ్మ తన విజయాలను జీవితకాల క్రమశిక్షణతో, సహనంతో దక్కించుకున్నారు. ఈ పవర్ ఫుల్ మెసేజ్‌ను ఈతరం వారికి మా సినిమా ద్వారా ఇవ్వబోతున్నాం” అన్నారు. నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీవాస్ కూడా మాట్లాడారు. హీరోయిన్ సుహాసినీ, నటుడు శివకుమార్, దర్శకుడు మహేంద్రన్, నటుడు, దర్శకుడు సముద్రఖని, నిర్మాతలు కలైపులి థాను, రాజేంద్రన్, కాట్రగడ్డ ప్రసాద్, ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన సతీమణి మాల తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు