ఎల్ నినో ప్రభావంతో నీటి కొరతకు అవకాశం
ఆరుతడి పంటలను సాగు మేలు
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సూపర్ ఎల్ నినో(super El Nino) ప్రభావం తీవ్రంగా ఉందని, దీనితో నీటి కొరతకు అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా(Save water) వాడాలని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(Kokkirala Prem Sagar Rao) అన్నారు. శని వారం ఎం ఎల్ ఏ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ఎఫెక్ట్ కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని వెల్లడించారు.
ఎల్ నినో తీవ్రత వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విపత్తును కరోనా మహమ్మారి తరహాలోనే ప్రజలందరి సహకారంతో సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలన్నారు. రైతులు(Farmers) సైతం ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట సాగు చేయకుండా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని సూచించారు.
శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని, యాసంగిలో రైతులు(Farmers) నీటి లభ్యతను బట్టి అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు(Drinking water), విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేస్తోందని తెలిపారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మంచిర్యాల నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, నియోజక వర్గాన్నీ అభివృద్ధిలో ముందుంచుతానన్నారు.
కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు అందించే చీరలు ఈసారి సంక్రాంతి పండుగకు 10 రోజుల ముందు పంపిణీ చేస్తామని, మహిళలు సహకరించాలన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.