సింగరేణి సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో కొండచిలువ కలకలం

02-10-2026 | 04:35pm
  1. అర్ధరాత్రి ఇంటి ఆవరణలో ప్రత్యక్షం
  2. పొదలు తొలగించి భద్రత కల్పించాలని డిమాండ్

మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న సింగరేణి సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో(Singareni CISF Quarters) భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో కార్మిక కుటుంబాల్లో భయాందోళన నెలకొంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో కాసిపేట గనిలో విధులు నిర్వహిస్తున్న ఓ సింగరేణి కార్మికుడు బాత్రూంకు వెళ్లేందుకు బయటకు రాగా, ఇంటి ఆవరణలో భారీ కొండచిలువ కనిపించింది.

దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టడంలో అనుభవం ఉన్న పాముల శేఖర్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని సుమారు 40 నుంచి 50 కిలోల బరువు ఉన్న కొండచిలువను చాకచక్యంగా పట్టుకొని జనావాసాలు లేని ప్రాంతంలో సురక్షితంగా వదిలేయడంతో కార్మిక కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

చిన్నారులు ఉండే ప్రాంతంలో కలకలం

సింగరేణి కార్మిక కుటుంబాలు నివసించే క్వార్టర్స్‌లో చిన్నారులు అధికంగా ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రాత్రివేళ ఇంటి ఆవరణలోనే భారీ కొండచిలువ కనిపించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు.

పొదలతో పాములకు ఆవాసంగా పరిసరాలు

క్వార్టర్స్ చుట్టూ చెట్లు, గుబురుగా పెరిగిన పొదలు, ఖాళీ ప్రదేశాలు ఉండటంతో పాములు సంచరించేందుకు అనుకూలంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

అధికారులు వెంటనే స్పందించాలి

కార్మిక కుటుంబాలు, చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. క్వార్టర్స్ పరిసరాల్లో పెరిగిన చెట్లు, పొదలు, చెత్తను వెంటనే తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు