రైతులే దేశానికి వెన్నెముక..
రైతుల సమస్యలపై గళమెత్తాలి- బీజేవైఎం జిల్లా అధ్యక్షులు, చెన్నూరు కౌన్సిలర్ శివకృష్ణ
చెన్నూర్, అక్టోబర్ 2 (విజయాక్రాంతి): “జై జవాన్.. జై కిసాన్” అంటూ దేశానికి సైనికుడు, రైతు రెండు కళ్లని చాటిచెప్పిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ కౌన్సిలర్ శివకృష్ణ(BJYM District President Shivakrishna) పిలుపునిచ్చారు.
శుక్రవారం లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలో రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాన్ని గుర్తించకుండా అభివృద్ధి గురించి మాట్లాడటం అసంపూర్ణమన్నారు.
మండుటెండ, వర్షం, ప్రకృతి వైపరీత్యాలను లెక్కచేయకుండా పంట పండించే రైతన్నకు సమాజం అండగా నిలవాలని అన్నారు. రైతు బలంగా ఉంటేనే గ్రామం బలపడుతుంది.. గ్రామం బలపడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల కోసం యువత ముందుండాలని పిలుపునిచ్చారు. రైతుల కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు దక్కేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.