బాల్య వివాహాలకు చెక్..

02-10-2026 | 06:02pm

బాలల హక్కుల పరిరక్షణ పై గ్రామ సభలలో అవగాహన

గరిడేపల్లి అక్టోబర్ 2 విజయ క్రాంతి): బాల్య వివాహాల(Child Marriages) నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తామని గరిడేపల్లి, కీతవారిగూడెం గ్రామ సభలలో తీర్మానం చేశారు.మహిళా శిశు సంక్షేమ శాఖ(Department of Women and Child Welfare), జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా గ్రామాల్లో గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య, కీతవారిగూడెం గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం గౌడ్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాలను బాల్య వివాహ రహిత ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో) కె. నరసింహారావు మాట్లాడుతూ.. బాలల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. మిషన్ వాత్సల్య కార్యక్రమాలు, అనాథ బాలల సంరక్షణ, బాలల దత్తత విధానం, బాలల సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల రక్షణ చర్యలు, బాల్య వివాహాల నివారణ తదితర , అవగాహన కల్పించారు.

బాలలపై వేధింపులు జరిగినప్పుడు వెంటనే స్పందించాలని, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.గ్రామ సభల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

గ్రామంలో బాల్య వివాహం జరిగే అవకాశం ఉన్నా, సమాచారం అందినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు.కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఎన్. రాజ్యలక్ష్మి, గ్రామపంచాయతీ కార్యదర్శులు జానకి, నాగేశ్వరరావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు సాయి త్రిలోక్, వంశీ, అంగన్‌వాడీ టీచర్లు, నారాయణమ్మ, మల్లమ్మ, సైదమ్మ, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు