అర్హత లేని వైద్యుల క్లినిక్‌లపై అధికారుల కొరడా
ఓకే మండలం.. ఓకే రోజు 7 ఆర్ఎంపి క్లినిక్ లు సీజ్
జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా.ఏ. శ్రీనివాసులు
మహమ్మదాబాద్, సెప్టెంబర్ 11(విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా లోని మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఓకే రోజు 7 ఆర్ఎంపి(RMP) క్లినిక్‌లు మూసి వేశారు. వైద్య విద్యార్హతలు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ, స్థాయికి మించి వైద్య చికిత్సలు అందిస్తున్న వారిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా.ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహమ్మదాబాద్‌లోని పలు క్లినిక్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో వైద్యార్హతలు లేని వారు రోగులకు చికిత్స అందించడం, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇవ్వడం, నెబ్యులైజర్లు వినియోగించడం వంటి విషయాలను అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఉపయోగించిన ఇంజక్షన్లను ప్లాస్టిక్ టబ్‌లు, ఖాళీ పేపర్ కార్టన్లలో ఎలాంటి మూతలు లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించారు. కొందరు హోమియోపతి, యునాని వైద్య విద్యను అభ్యసించినప్పటికీ అల్లోపతి విధానంలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి అనధికార వైద్య విధానాల వల్ల రోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం కారణంగా రోగనిరోధక శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
ప్రథమ చికిత్స కేంద్రాలు కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాలని ఆయన స్పష్టం చేశారు. యాంటీబయాటిక్ ఇంజక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్, స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కలిగిన క్లినిక్‌లు సైతం బయోమెడికల్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించే సంస్థలకు అప్పగించాలని, బహిరంగ ప్రదేశాల్లో పడవేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. రాజు (ఎయిడ్స్ & లెప్రసీ అధికారి), డా. శివకాంత్ (ప్రోగ్రాం అధికారి), హెల్త్ ఎడ్యుకేటర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.