షియర్ జోన్ దాటాం

05-10-2026 | 05:25am
  1. ఎస్‌ఎల్బీసీ సొరంగం పనుల్లో క్లిష్ట దశ పూర్తి
  2. బలహీన శిలల మండలం అధిగమించిన తవ్వకాలు 79% పనులు కంప్లీట్
  3. 2028 జూన్ నాటికి నీరందించేలా కార్యాచరణ: -మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన షియర్ జోన్‌ను దాటడంతో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Telangana Irrigation Minister Uttam Kumar Reddy) తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బలహీన శిలల మండలాన్ని సురక్షితంగా అధిగమించామని, తద్వారా పనుల్లో వేగం పెంచేందుకు మార్గం సుగమమైందన్నారు.

అదనపు యంత్రాలను రంగం లోకి దించి, తవ్విన రాళ్లు, మట్టిని బయటకు ఎప్పటికప్పుడు బయటకు తరలించా లని ఆదేశించారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టు ఎస్‌ఎల్బీసీ పనులపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సొరంగం పురోగతి,  ఎదురవుతున్న సమస్యలు, అదనపు యంత్రాల వినియోగంపై చర్చించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా  మెట్ట ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీరందించి, ఏళ్లుగా నెలకొన్న సాగునీటి తీర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2028 జూన్ నాటికి నీటిని అందించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించాలని, పనులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు. గడిచిన ఐదారు నెలల్లో సొరంగం పనులు 700 మీటర్ల మేర ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం మంత్రికి వివరించింది.

అవుట్ లెట్ వైపు సుమారు 4,50 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల మేర పనులు పూర్తయినట్లు తెలిపింది. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యాయని, మరో 9.1 కిలో మీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించింది. అత్యంత క్లిష్టమైన షియర్ జోన్‌ను దాటడం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక మైలురాయిగా  పేర్కొన్నారు. అధికారులు, కార్మికుల కృషిని మంత్రి ప్రశంసించారు. ఇదే పురోగతిని కొనసాగిస్తూనూ సొరంగంలో 20 కిలో మీటర్లకు పైగా లోపల పనిచేస్తున్న సిబ్బంది భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

టన్నెల్ పనుల్లోనూ వేగం పెంచండి..

టన్నెల్‌1లో రెండు వైపుల నుంచి సాగుతున్న తవ్వకాలు 2028 మే లేదా జూన్ నాటికి కలిసే దశకు చేరుకుంటాయని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన సొరంగంతోపాటు టన్నెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇతర అనుబంధ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. వీటిలో ఏ పని అసంపూర్తిగా ఉన్నా నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని, అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు 7.1 కిలో మీటర్ల పొడవున్న టన్నెల్ సుదీర్ఘ విరామం తర్వాత లైనింగ్ పనులు తిరిగి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.   

కల్నల్ పరీక్షిత్ పర్యవేక్షణలో తవ్వకాలు..

భారత సైన్యానికి చెందిన సొరంగ నిర్మాణ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా పర్యవేక్షణలో  తవ్వకాలు జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా ఇన్‌లెట్  ఎదురైన పరిస్థితులను కల్నల్ పరీక్షిత్ మంత్రికి వివరించారు. బలహీనమైన నేల, రాళ్లు ఒక్కసారిగా విరిగిపడే  ప్రమాదకర పరిస్థితులున్నందున మరో ప్రమాదం జరగకుండా తొలుత తవ్వకాల్లో వేగం తగ్గించినట్లు తెలిపారు. బలహీనమైన శిలల మండలం ఎదురైన ప్రాంతాన్ని సురక్షితంగా దాటేందుకు గొడుగు మాదిరి రక్షణ కవచం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బలమైన రిబ్‌లను అమర్చడం, దశలవారీగా తవ్వడం, ముందున్న శిలల పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ చేయడం, అదనపు రక్షణ ఏర్పాట్లతో ప్రమాదాలను నియంత్రిస్తూ ముందుకు సాగినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సుమారు ఎనిమిది మీటర్ల మేర పురోగతి నమోదవుతోందని స్పష్టం చేశారు.  అవుట్ లెట్ వద్ద మూడు డ్రిల్లింగ్ భుజాలున్న బూమర్ యంత్రం ఇప్పటికే పనిచేస్తోందని, అక్కడ పనులు అవసరమైన వేగానికి చేరువలో ఉన్నాయని వెల్లడించారు.

ఇన్లెట్ వద్ద కూడా ఇదే తరహా మరో యంత్రం అక్టోబరులో అందుబాటులోకి రానుందని పేర్కొంది. విద్యుత్‌తో నడిచే లోడర్లు, అధునాతన ఎక్స్కవేటర్లను కూడా పనుల్లో వినియోగిస్తున్నట్లు వివరించింది. జర్మనీ నుంచి తెప్పిస్తున్న రైలు ఇంజిన్ (లోకోమోటివ్) అక్టోబర్ నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీని వినియోగంతో తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా బయటకు తరలించవచ్చని, తద్వారా ఒక్కో దఫా పనికి పట్టే సమయం తగ్గుతుందని చెప్పారు.

అక్టోబర్ చివరి లేదా నవంబర్ ప్రారంభం నుంచి పనుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైన యంత్రాలను సకాలంలో సమకూర్చి, తవ్వకాల ప్రతి దశలో సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు.  సమీక్షలో భువనగిరి, మిర్యాలగూడ ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, కే.జయవీర్ రెడ్డి, వేముల వీరేశం, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్; నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేష్‌బాబు, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు