ఘనంగా కేబీసీఏ దుర్గోత్సవ్ ప్రారంభం
ఈ నెల 21 వరకు జరగనున్న ఉత్సవాలు
రాధే గ్రూప్ సమర్పణలో మాదాపూర్లోని సీసీఆర్టీలో నిర్వహణ
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రాధే గ్రూప్ సమర్పణలో, కొండాపూర్ బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ (Kondapur Bengali Cultural Association) తొలిసారిగా నిర్వహిస్తున్న దుర్గా పూజ వేడుకలు ‘కేబీసీఏ దుర్గోత్సవ్ 2026’ శుక్రవారం మాదాపూర్లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్టీ)లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
శుక్రవారం నుంచి ఈ నెల 21 వరకు ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో బెంగాల్ సంప్రదాయాలు, ఆచారాలు, కళలు, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేబీసీఏ అధ్యక్షుడు అయన్ దేబ్ బర్మన్ మాట్లాడుతూ, మేము కేబీసీఏని ప్రారంభించినప్పుడు ఈ ఏడాది చిన్న ప్రయత్నంగా, ఒక ముందస్తు వేడుకగా నిర్వహించాలని అనుకున్నాం.. కానీ అమ్మ దుర్గ ఆశీస్సులతో మా అంచనాలకు మించి ఈ కార్యక్రమం విస్తరించింది.. నేడు 200కు పైగా కుటుంబాలు, 500 మందికి పైగా వ్యక్తిగత సభ్యులు మాతో ఉన్నారు.
ప్రతిరోజూ మహాభోగ్ కోసం 1,000కు పైగా కూపన్లు తీసుకోవడం ప్రజల ఆదరణకు నిదర్శనం. మా వృత్తిపరమైన విజయాల కంటే, ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా, గౌరవంగా ఆహ్వానించే మా సంస్కృతే మాకు ముఖ్యం. ఈ విజయం వెనుక అమ్మ దుర్గ ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నాం. మమ్మల్ని విశ్వసించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ పూజ అంకితం అని అన్నారు. మొదటి రోజున మహా షష్ఠి ప్రారంభోత్సవం, ఆనందమేళా, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం సప్తమి సందర్భంగా ధునుచి నాచ్, సంప్రదాయ ఛౌ నృత్యం నిర్వహిస్తారు. ఈ నెల 18న మహా అష్ఠమి సందర్భంగా పంచఫోరన్ ప్రదర్శన, 19న మహా నవమి సందర్భంగా హిందోలిత ప్రదర్శన, 20న వోయేజ్ బెంగాలీ ప్రత్యేక ప్రదర్శన ఉంటాయి. 21న విజయదశమి వేడుకలతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ కార్యక్రమానికి రాధే గ్రూప్ టైటిల్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తుండగా, ఐరోక్ హాస్పిటల్స్, సంస్కృతి స్కూల్, గ్లో బై కిర్టిలాల్స్, ప్యాలెస్ హైట్స్తో పాటు ఇతర భాగస్వాములు, శ్రేయోభిలాషులు మద్దతు అందిస్తున్నారు. కేబీసీఏ 2026 కార్యవర్గంలో అధ్యక్షుడిగా అయన్ దేబ్ బర్మన్, ఉపాధ్యక్షురాలిగా తనయా భట్టాచార్య, ప్రధాన కార్యదర్శిగా శుభదీప్ భట్టాచార్య, సంయుక్త కార్యదర్శిగా శుభజిత్ ఘోష్, కోశాధికారిగా శశాంక్ మిత్ర ఉన్నారు. కార్యవర్గ సభ్యులుగా అనిర్బన్ గోస్వామి, జె. శంకర్ పరీడా, సౌరభ్ మైతి, బిస్వజిత్ ఘోష్, శౌవిక్ ఎస్. మజుందార్ వ్యవహరిస్తున్నారు.