కరువుపై ముందస్తు చర్యలేవీ?
సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు
యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్ర
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): కరువు వస్తుందనే ముందే హెచ్చరించినా ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha) మండిపడ్డారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నుంచే ఎల్ నినో ఎఫెక్ట్‌తో తీవ్రమైన కరువు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినా కనీస చర్యలు చేపట్టకుండా ఇప్పుడొచ్చి రైతులు త్యాగాలు చేయాలని నీతులు వల్లించడం సిగ్గుచేటన్నారు.
కరువు విషయంలో తాను ఏమీ చేయలేనని సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయతను వ్యక్తం చేస్తూ చేతులెత్తేశారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కరువు మండలాలను ప్రకటించి కేంద్రానికే ఇప్పటికే నివేదిక పంపాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుందని.. ఇప్పటి వరకు పాలమూరు- పూర్తి చేయలేదని, మేడిగడ్డ బరాజ్‌ను కూడా రిపేర్ చేయలేదని అన్నారు. వాటిని పూర్తి చేసి ఉంటే ఇవ్వాళ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇవ్వలేదన్నారు. పాలమూరు బిడ్డ అయి ఉండి కనీసం భీమా, నెట్టంపాడు ప్రాజెక్ట్ లను కూడా పూర్తి చేయకపోవటం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో పంటలు సాగు చేయకపోతే రైతు కూలీలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ లో కొన్ని కాంపొనెంట్లను ప్రైవేటీకరించి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. పవర్ మ్యాక్స్ అనే కంపెనీతో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. కరెంట్ కష్టాలను అధిగమించేందుకు అవసరమైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కలుస్తామని.. ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడతామని చెప్పారు. కాగా ఉద్యమకాలంలో బీఆర్ఎస్ కు పూర్తి అండగా ఉన్న శ్రీనివాస్ రావుపై కేటీఆర్ విచారణ కోరడం అంటే నమ్మినోళ్లను నట్టేట ముంచడమేనన్నారు. ప్రతిమ శ్రీనివాస్ ను సీఎం ఎందుకు కాపాడుతున్నాడని ప్రశ్నించారు. కార్మికుల కోసం పనిచేస్తున్న హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కూటమే సింగరేణి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.