తెలంగాణకు హ్యుందాయ్

17-10-2026 | 05:55am
  1. జహీరాబాద్‌లో గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం
  2. 8,528 కోట్ల పెట్టుబడి.. 678 ఎకరాల్లో అభివృద్ధి త్వరలోనే భూమి పూజ
  3. కంపెనీ ప్రతినిధుల వెల్లడి
  4. పెండింగ్ అనుమతులు పూర్తిచేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  5. కార్ల తయారీ ప్లాంట్ పెట్టాలని యాజమాన్యానికి పిలుపు
  6. సహాయ సహకారాలు అందిస్తామని హామీ

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్‌లో హ్యుందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌(Hyundai car manufacturing plant)ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అం దిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్ గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రానికి సంబంధించిన పెం డింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్‌ఎంఐఈ) మేనేజింగ్ డైరెక్టర్ చాం గ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృం దం సీఎం రేవంత్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, జహీరాబాద్‌లో ప్రతిపాదిత ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ (ఎన్‌ఐఎంజీ)లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ మోటార్ ఇండి యా ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

678 ఎకరాల్లో విడతలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రికి హ్యుందాయ్ ప్రతినిధులు  వివరించారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఆర్ అండ్ డీ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి... అవసరమైన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు.

హ్యుందాయ్ సంస్థకు హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉందని సీఎం  రేవంత్‌రెడ్డి  తెలిపారు. ‘హైటెక్ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు మద్దతునిస్తూ కీలక ఆర్ అండ్ డీ  కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఈ సామర్థ్యాలను మరింత విస్తరించేలా జహీరాబాద్‌లో గ్లోబల్ ఆర్ అండ్ డీ, మెగా టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా వాహనాల రూపకల్పన, పరీక్షలు, పనితీరు, ధ్రువీకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతోపాటు ఇంజినీరింగ్ ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలగనుంది.

హ్యుందాయ్ అధునాతన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.  దేశంలో తెలంగాణ భౌగోళికంగా మధ్యలో ఉందని, హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన నగరం’ అని సీఎం తెలిపారు. దేశంలోని ఆరు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సురక్షితమైన, జీవించడానికి అనుకూలమైన కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలతోపాటు భవిష్యత్తులో ఓడరేవులకు హైస్పీడ్ కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. 

పారిశ్రామిక విస్తరణకు చర్యలు..

ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్ల అభివృద్ధితో వాహన తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని సీఎం చెప్పారు. పెరి-అర్బన్ రీజియన్ (ప్యూర్ ) వంటి ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తయారీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనువైన వేదికగా నిలుస్తుందని ఆయన  వివరించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 2024 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో తన నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్ ప్రతినిధులతో చర్చలు జరిపిన విషయాన్ని ముఖ్యమంత్రి తెలిపారు.  2025 జూన్‌లో  హ్యుందాయ్ ఆర్‌అండ్ డీ  కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారీ శాటిలైట్ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని హ్యుందాయ్ ప్రతినిధి బృందానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేస్తూ, రాబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ హాజరుకావాలని సంస్థ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సాంకేతిక, అధునాతన ఇంజినీరింగ్ కేంద్రంగా మరింత బలోపేతం చేయాలన్న హ్యుందాయ్ లక్ష్యం తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌కు తగ్గట్టు ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో తమ సంస్థ భాగస్వామిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సీఎం  సలహాదారు, ఎక్స్-ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు