గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రతా చర్యలు
నిమజ్జన కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాల(Ganesh immersion ceremonies)ను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందని జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) తెలిపారు. మంగళవారం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని ప్రధాన గణేష్ నిమజ్జన కేంద్రం పెద్దవాగును ఆమె పరిశీలించారు. మండపాల నుంచి నిమజ్జన కేంద్రాల వరకు గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాలను పరిశీలించిన ఎస్పీ.. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన కేంద్రాల వద్ద బారికేడింగ్, రోప్ బ్యారియర్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గణేష్ విగ్రహాలతో వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్ మ్యాప్ రూపొందించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.భారీగా ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిరంతర పోలీస్ నిఘా ఉండాలని, అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వినియోగించాలని తెలిపారు. నీటి వనరుల్లో ప్రమాదకరమైన, లోతైన ప్రాంతాలను గుర్తించి బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, నిమజ్జనానికి వినియోగించే క్రేన్లు, ఇతర యంత్ర పరికరాలను సురక్షితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వైద్య, అగ్నిమాపక, రక్షణ బృందాలతో సమన్వయం చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు తప్పిపోయిన సందర్భాల్లో సహాయం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు.ఒకేసారి భారీగా వాహనాలు, ప్రజలు నిమజ్జన కేంద్రాలకు చేరకుండా క్రమబద్ధమైన రాకపోకలు, అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు పోలీస్ శాఖ సూచనలు పాటించాలని ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.