పీహెచ్‌సీల్లో ఆధునిక వైద్య పరీక్షలకు శ్రీకారం
22 మల్టీ-పారామెట్రిక్ డయాగ్నస్టిక్ సిస్టమ్స్ ను ప్రారంభించిన కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 22 మల్టీ-పారామెట్రిక్ డయాగ్నస్టిక్ సిస్టమ్స్(22 multi-parametric diagnostic systems)ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత(Collector K. Haritha) తెలిపారు. వీటి ద్వారా పీహెచ్‌సీల్లోనే సుమారు 75 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మాట్(Additional Collector Yuvraj Marmat), ఓమిని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ బటియాతో కలిసి కలెక్టర్ ఈ పరికరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ పరికరాల ద్వారా రోగుల వైటల్స్‌ను పరిశీలించడంతో పాటు వివిధ రక్త పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. తద్వారా ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు వీలుంటుందని తెలిపారు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
సీఎస్‌ఆర్ కార్యక్రమం కింద వైద్య పరికరాలను సమకూర్చిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఏవియానిక్స్ డివిజన్ హైదరాబాద్, ఓమిని యాక్టివ్ ఫౌండేషన్కు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగేంద్ర, ఆకాంక్షిత జిల్లా సమన్వయకర్త బాలరాజు, వైద్య అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.