మిల్లింగ్‌ మాయాజాలం.ముడుపుల ఆరోపణల కలకలం

02-11-2026 | 03:16pm

ఐదు మండలాల్లో సీఎంఆర్‌ అక్రమాలపై అనుమానాలు

రేషన్‌ బియ్యం దళారుల చేతుల్లోకి.. రీసైక్లింగ్‌ చేసి తిరిగి సరఫరా

బియ్యం ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం

విజిలెన్స్‌ విచారణకు డిమాండ్‌

సత్తుపల్లి,(విజయక్రాంతి): పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం(Ration rice) పక్కదారి పడుతోందా? ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్‌ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయా? కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లోని పలు రైస్‌ మిల్లుల్లో(Rice Mill) భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం చర్చనీయాంశంగా మారింది. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (Custom Milling Rice) వ్యవహారంలో కొందరు అధికారులు, మిల్లర్ల మధ్య అనధికారిక అవగాహన ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

తనిఖీలు చేయకుండానే ధ్రువీకరణలా?

మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లింగ్‌ వివరాలు, బియ్యం అప్పగింతలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీలు నిజంగా జరుగుతున్నాయా? లేక కార్యాలయాల నుంచే నివేదికలు, సంతకాలు పూర్తవుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దళారుల చేతుల్లోకి రేషన్‌ బియ్యం!

పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యాన్ని దళారులు సేకరించి మిల్లులకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసైక్లింగ్‌ చేసి తిరిగి మార్కెట్‌లోకి లేదా ప్రభుత్వ సరఫరా వ్యవస్థలోకి చేరుస్తున్నారా? అన్న కోణంలో విచారణ జరగాల్సి ఉంది.

ధరల పెరుగుదలతో ప్రజాగ్రహం!

మరోవైపు బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిల్లుల వ్యవహారంలో ముడుపుల ఆరోపణలపైనా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి!

కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లోని రైస్‌ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రికార్డుల్లోని నిల్వలు, క్షేత్రస్థాయి నిల్వలను సరిపోల్చాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ధాన్యం సేకరణ నుంచి సీఎంఆర్‌ అప్పగింత వరకు సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఐదు మండలాల్లో జరుగుతున్నాయన్న అక్రమాల ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు. విజిలెన్స్‌ విచారణ ఎప్పుడు మొదలవుతుంది? అన్నదే ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు